PM Modi: భారత మహిళల కలలను ధ్వంసం చేశారు, వారికి తప్పకుండా శిక్ష పడుతుంది- విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
రిజర్వేషన్ల కోసం ఎందరో మహిళలు పోరాటం చేశారని గుర్తు చేశారు. మహిళా బిల్లు క్రెడిట్ ను తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రధాని మోదీ వాపోయారు.
- మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు
- కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీలు బిల్లును అడ్డుకున్నాయి
- బిల్లును అడ్డుకున్న పాపం వారిని వదలదు
- మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు తప్పకుండా శిక్ష పడుతుంది
PM Modi: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని, భారత మహిళల కలలను ధ్వంసం చేశారని విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. భారత నారీ శక్తి ఎదగకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దేశ హితమే మాకు ముఖ్యం అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. కానీ, కొందరికి మాత్రం దేశం కంటే రాజకీయాలే ముఖ్యం అని విమర్శించారు. రిజర్వేషన్ల కోసం ఎందరో మహిళలు పోరాటం చేశారని గుర్తు చేశారు. మహిళా బిల్లు క్రెడిట్ ను తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రధాని మోదీ వాపోయారు. రిజర్వేషన్ల కోసం తెచ్చిన బిల్లు వీగిపోవడం పట్ల.. భారత మహిళలకు క్షమాపణ చెప్పారు ప్రధాని మోదీ.
”మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. ఈ భ్రూణహత్యలో ప్రధాన పాపం కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీలదే. అన్ని రాష్ట్రాలకు సమాన బలం దక్కేలా బిల్లు తెచ్చాం. మహిళా బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనీయవు.
దేశ హితం కోసం, నారీ శక్తి హితం కోసం బిల్లు తెచ్చాం. మహిళా శక్తిని ఈ దేశం ఇంకా చూడాల్సి ఉంది. స్వార్ధ రాజకీయాల కోసం నారీశక్తిని అడ్డుకున్నారు. అన్ని విషయాలను మహిళలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పాపం వారిని వదలదు. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు తప్పకుండా శిక్ష పడుతుంది” అని ప్రధాని మోదీ హెచ్చరించారు.
”కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ.. గతంలో చాలాసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకుంది. మహిళా బిల్లును అడ్డుకుని తన నిజస్వరూపం చూపించాయి. కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవిలా బతికేస్తోంది. స్థానిక పార్టీలపై ఆధారపడి జీవిస్తోంది” అని ప్రధాని మోదీ మండిపడ్డారు.
