Rahul Gandhi: జైశంకర్ అందుకే అమెరికా వెళ్లారన్న రాహుల్.. కౌంటర్ ఇచ్చిన విదేశాంగ మంత్రి
ఉత్పత్తి రంగంలో మనదేశం రాణించలేకపోవడంతోనే చైనా మన దేశంలో వ్యాపారంలో నిలదొక్కుకుంటోందని కూడా రాహుల్ చెప్పారు.

Rahul Gandhi, Jaishankar,
“అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని కోరడానికి యూఎస్‌కు మన విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్లకుండా ఉంటే బాగుండేది” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ మండిపడ్డారు.
రాహుల్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 2024 డిసెంబరులో జైశంకర్ అమెరికాలో పర్యటించారు. దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసేందుకు జైశంకర్ అక్కడికి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. మోదీని ఆహ్వానించాలని కోరడానికే దాదాపు నాలుగు సార్లు జైశంకర్‌ను అమెరికాకు పంపారని ఆరోపించారు. ఒకవేళ తయారీ రంగంతో పాటు కృత్రిమ మేధలో మన దేశ దూసుకువెళ్తే ట్రంపే ఇండియాకు వచ్చి మోదీని ఆహ్వానించే వారని చెప్పారు.
Also Read: వామ్మో.. ఓ చేతిలో సంచి, మరో చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలుసా?
జైశంకర్ ఏమన్నారు?
రాహుల్ వ్యాఖ్యలపై జైశంకర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. తాను చేసిన అమెరికా పర్యటనపై రాహుల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను అప్పట్లో జో బైడెన్ ప్రభుత్వంలోని కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారును కలిసేందుకు అమెరికా వెళ్లానని చెప్పారు. అలాగే, కాన్సుల్స్ జనరల్ భేటీకి నేతృత్వం వహించానని తెలిపారు.
మోదీకి ఆహ్వానం పంపాలంటూ తానే చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. భారత ప్రధాని సాధారణంగానే అటువంటి కార్యక్రమాలకు హాజరుకారన్నది సుస్పష్టమైన విషయమని తెలిపారు. అన్నీ తెలిసి రాహుల్ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. మన దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం తీరుపై రాహుల్ విమర్శలు
మరోవైపు, కేంద్ర సర్కారు మేకిన్ ఇండియా కార్యక్రమంలో విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియా ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇందులో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఉత్పత్తి రంగంలో మనదేశం రాణించలేకపోవడంతోనే చైనా మన దేశంలో వ్యాపారంలో నిలదొక్కుకుంటోందని చెప్పారు. తయారీ రంగంలో భారత్ విఫలమై మార్కెట్‌ను చైనాకు అప్పగిస్తున్నామని విమర్శించారు.