భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత

ఢిల్లీ : భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బీరేంద్ర సింగ్ ధనోవా, నావికా దళాధిపతి సునీల్ లాంబాకు ఇకపై జడ్ ప్లస్ భద్రత కల్పించనున్నారు. ఈ ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు త్రివిధ దళాధిపతులకు అత్యున్నత స్థాయి భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 27న త్రివిధ దళాలు నిర్వహించిన మీటింగ్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన నేపథ్యంలో వీరిపై దాడి జరుగవచ్చు లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారంతో వీరి భద్రతను పెంచినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మార్చి 2 శనివారం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని.. వారికి భద్రతను పెంచుతామని వెల్లడించింది.
అయితే ఇప్పటివరకు వీవీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే దేశంలోనే అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ భద్రత ఇవ్వడం జరుగుతోంది. కానీ ఇకనుంచి త్రివిధ దళాధిపతులకు కూడా జడ్ ప్లస్ భద్రతను ఏర్పాటు చేయనున్నారు.