కరీంనగర్‌కు 100 వైద్య బృందాలు : ఆ 8 మంది ఎక్కడ తిరిగారు ? ఎవరిని కలిశారు ?

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 05:18 AM IST
కరీంనగర్‌కు 100 వైద్య బృందాలు : ఆ 8 మంది ఎక్కడ తిరిగారు ? ఎవరిని కలిశారు ?

Updated On : March 19, 2020 / 5:18 AM IST

కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్‌ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. 2020, మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన 10 మంది సభ్యుల బృందం 2020, మార్చి 14వ తేదీ ఉదయం రామగుండం చేరుకుంది. ఆ తర్వాత రోజు కరీంనగర్‌కు వచ్చింది. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌లో టెన్షన్‌ నెలకొంది. వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కరీంనగర్‌లో ఆంక్షలు విధించింది. ఇండోనేసియా బృందం కలెక్టరేట్‌కు సమీపంలోనే బసచేసింది. దీంతో మూడు కిలోమీటర్ల మేర ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. నగరంలో దుకాణాలు తెరుచుకోలేదు. పదో తరగతి పిల్లలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు.

See Also | కరోనా భయం, కరీంనగర్‌లో ప్రతి ఇంట్లో నిర్భంద వైద్య పరీక్షలు

8 మందితో క్లోజ్ : – 
ఇండోనేసియా బృందం ఎవరెవరితో సన్నిహితంగా తిరిగారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. 8మంది వీరితో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఆ 8మంది ఎక్కడెక్కడ, ఎవరెవరితో తిరిగారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు వంద ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. వారు ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు : – 
ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే.. దేశవ్యాప్తంగా మొత్తం 169 కరోనా కేసులు నమోదైతే తెలంగాణలోనే 13 రికార్డయ్యాయి.

* ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన వారిలో కోవిడ్‌-19 లక్షణాలు.
* ఏడుగురిలో కరోనా లక్షణాలు గుర్తించిన వైద్యులు.
* ఢిల్లీ నుంచి ట్రైన్‌లో వచ్చిన ఇండోనేషియా మత ప్రచారకులు.

* ఏపీ సంపర్క్ క్రాంతి ఎస్‌9 బోగీలో ప్రయాణించిన ఇండోనేషియన్లు.
* వారితో పాటు మరి కొంతమంది వచ్చినట్లు ప్రచారం..!.
* వారి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం.

* బోగీలో 82 మంది ప్రయాణించినట్లు సమాచారం.
* ఎక్కడెక్కడ తిరిగారు..? అసలు ఎంత మంది వచ్చారు..?.
* బోగీలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారున్నారా..?.

* వైద్యారోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారుల సమాచారం.
* ఫోన్‌ నెంబర్ల ద్వారా వివరాలు సేకరిస్తున్న అధికారులు.

Read More : work from home : తుమ్మినా..దగ్గినా లీవ్