చంద్రబాబు బురద జల్లుతున్నారు.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు: అంబటి

ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు.
ఎల్లో మీడియాతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని అంబటి విమర్శించారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాద సంస్థల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారని రాంబాబు అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎలా విమర్శించారో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికలైన తర్వాత మోడీని అద్భుతమైన నేతనని అంటున్నారు. ప్రతితిదానికి సీబీఐ విచారణ కావాలంటున్నారు.
అధికారం పోయాక వ్యవస్థలపై నమ్మకం కలిగిందా?. రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే అక్కడ ప్రమాదం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ విషయంలో గగ్గోలు పెట్టిన టీడీపీ ఎందుకు రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో మౌనంగా ఉందని అన్నారు.