ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషన్ అధికారులు, డీజీపీ పాల్గొనడం గమనార్హం. అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇంకా ప్రిన్స్‌పాల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇందులో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి.
కౌంటింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఫలితాల సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు కొంత విఘాతం కలిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా అకాల వర్షాలతో పలు పంటలు ధ్వంసమయ్యాయి. రైతులను ఆదుకోవాల్సిన వాటిపై చర్చిస్తున్నారు. రాయలసీమ, ఒంగోలు, తదితర జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ తీసుకోవాల్సిన వాటిపై సమీక్షిస్తున్నారు.
సీఎస్ పరిపాలనా వ్యవహారాలపై కూపీ లాగుతుండడంపై టీడీపీ పెద్దలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమకు 9వేల కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ నాలుగోవిడతకు 3,300 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 2,200 కోట్ల రూపాయల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులను సీఎస్ ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదంతో తెచ్చిన అప్పులపై కూడా అధికవడ్డీలకు ఎందుకు తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు.
గతంలో జరిగిన వ్యవహారాల్లో ఎల్వీ సుబ్రమణ్యం వేలు పెడుతుండడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ చేసిన నిర్ణయాలపై ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్లు చేయడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఎల్వీ సుబ్రమణ్యం తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదని స్పష్టం చేశారు.
తాజాగా ఎల్వీ సుబ్రమణ్యం జరుపుతున్న ఈ సమీక్షపై ఎలాంటి విమర్శలు చెలరేగుతాయో చూడాలి మరి.