చీమలే పరమాన్నం : గుత్తికోయల దుర్భర జీవితం

ఖమ్మం: స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఆకలితో అలమటించే ప్రజలున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పధకాలు అమలు చేసినా కడుపు నిండా తినడానికి తిండిలేక ఆకులు, అలములు.. ఆఖరికి చీమలు కూడా తింటున్నారు. పిడికెడు చీమలను తిని.. నీళ్లు తాగి నిద్రిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లకు చీమలే పంచభక్ష పరమాన్నాలు. చీమల వేపుడే చికెన్ బిర్యానీ. చీమల కూరే చేపల కూర. చీమల ఫ్రైయ్యే వారికి ఫ్రైడ్ రైస్. పనిదొరకక.. తినడానికి తిండిలేక చీమలనే ఆహారంగా తీసుకుంటున్నారు గొత్తి కోయలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మొద్దులమాడ. ఇది జిల్లాలో మారుమూల అటవీప్రాంతం. వలస గిరిజనులకు షెల్టర్ జోన్. వీళ్లంతా గుత్తికోయలు.. ఛత్తీస్‌గఢ్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చారు. అటవీశాఖ వారు పెంచే వెదురు చెట్లను నరికే పని చేస్తారు. ఈ పని వేసవి కాలంలోనే ఉంటుంది. వానా కాలం, చలికాలంలో వీరికి పనిదొరకదు. దీంతో చేతిలో డబ్బులేక అడవిలో దొరికే దుంపలను, చీమలను ఆహారంగా తీసుకుంటారు. వీరికి రేషన్ కార్డు ఉండదు. ప్రభుత్వం అమలు చేసే పనికి ఆహార పధకం వీరికి తెలియదు.
గుత్తికోయలు పుట్టెడు చీమలున్న చెట్ల కొమ్మలను నరుకుతారు. ఓ పక్క చీమలు కుడుతుంటే, మరోపక్క వాటిని బేసిన్‌లో నింపుతారు. చీమలను ఆకులలో వేసి చుడుతారు. చీమలను గిన్నెలో వేసి..మాంసం కూరలాగా వండుతారు. ఇంట్లో జొన్నలు ఉంటే జావ చేసుకుని.. చీమలను కూరగా వేసుకుని తింటారు. జొన్నలు లేకపోతే చీమల వేపుడు తింటారు. దుర్బర జీవితం గడుపుతున్న గుత్తికోయలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న గొత్తి కోయలకు రేషన్ సరుకులు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.