ఆరోగ్యశ్రీ : ఆరోజు వైస్సార్, ఈరోజు జగన్

రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు నుంచే ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో కొత్త వ్యాధులు కలిపి మొత్తం 2,059 వ్యాధులకు చికిత్స అందించేలా రూపకల్పన చేసి… నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు నుంచే ఈ పధకాన్ని తిరిగి ప్రారంభించడం విశేషం.
మే నెలాఖరుకు రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్నిరకాల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నెట్ వర్క్ ఆసుపత్రుల పనితీరు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని…. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది లేరు అన్న మాట రాకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.16వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10వేలు పింఛను ఇస్తున్నామని.. కుష్ఠు వ్యాధిగ్రస్తులకు ఫిబ్రవరి 1 నుంచి నెలకు రూ.3వేల పింఛను అందచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 1060 కొత్త అంబులెన్సులను మార్చి నెలాఖరుకల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.
చికున్ గున్యా, మలేరియా, డెంగీ, వడదెబ్బకు కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని అన్నారు. 510 రకాల మందులను కూడా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 6 నెలలపాటు అవ్వ, తాతలకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం అని చెప్పారు. జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా మార్చబోతున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే విద్యార్థులు భావితరంతో పోటీపడగలరు అని సీఎం అన్నారు.