రివర్స్ టెండరింగ్ దేశానికే ఆదర్శం అవుతుంది : సీఎం జగన్

పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చేశామని…ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ. 830 కోట్లు ఆదా చేశామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5, బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఒక టెండర్, ప్రాసెస్ కంటే ముందే న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది. జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్ట్ సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పునైనా న్యాయమూర్తి సూచించవచ్చు. ఏడు రోజులపాటు టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఆ టెండర్లకు ఒకే చెప్తారు. ఆ తర్వాత అత్యంత తక్కువ కోట్ చేసిన ధరను ప్రకటిస్తారు. ఆ ధరకంటే కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంకా ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే వారికి ఇస్తాం అని ఆయన తెలిపారు.
3 రాజధానుల అంశం, ఇంగ్లీషు మీడియంపై మాట్లాడుతూ జగన్ …అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన ఆహుతులను ఆయన ప్రశ్నించారు. ‘బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లీషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్‌నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు.
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన వివరించారు.
ఒకవైపు ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యావ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. వచ్చే మూడేళ్లల్లో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. స్కూల్ బిల్డింగ్‌లు, బాత్‌రూమ్‌లు, ఫర్నీచర్ సహా అన్నింటినీ మార్చబోతున్నాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల నాణ్యతను పెంచబోతున్నాం. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాం. వంటలు చేసే ఆయాల జీతాల పెంచాం అని ఆయన చెప్పారు.
అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చాం. తల్లులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే ఏడాది రూ. 15వేలు అందజేస్తాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకోస్తున్నాం. డిగ్రీని నాలుగేళ్లపాటు, ఇంజనీరింగ్‌ను ఐదేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థులకు 100 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తున్నాం. ఏపీలో ప్రతి విద్యార్థికి విద్య రూపంలో ఎప్పటికీ తరగని ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. తన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపిన ది హిందూ పత్రికకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.