మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే ఉందని విమర్శించారు. చెప్పిన అబద్దాలను పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సజ్జల గురువారం (జూన్ 2, 1010) మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అవినీతి కోసమే పథకాలు పెట్టేవారని ఎద్దేవా చేశారు.
తాము మ్యానిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలను దాదాపు వంద శాతం పూర్తి చేశామని చెప్పారు. జగన్ రూ. 28 వేల కోట్ల నగదును ప్రజలకు నేరుగా అందించారని తెలిపారు. 108, 104 సేవలను అంతర్జాతీయ స్థాయిలో అందిస్తున్నామని పేర్కొన్నారు. 1800 అంబులెన్స్ లు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.. అంబులెన్సులు ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు.
ప్రజలు సరదాగా జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టలేదని.. జగన్ ప్రజల కోసం ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. పర్టిక్యులర్ అంశాలపై లెక్కలేనన్ని సార్లు నిరవధిక దీక్షలు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రోజైనా పోరాటాలు చేశారా? ఎక్కడైనా దీక్షలకు కూర్చున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక రకమైతే ఆయన కొడుకు లోకేష్ కు ఇప్పటికే 80 ఏళ్లు అయినట్టున్నాయన్నారు. ట్విట్టర్ లో కామెంట్ చేస్తుంటారని మండిపడ్డారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రజలను ఉత్తేజితం చేస్తుందన్నారు. ఆయన చనిపోతే వందలాది గుండెలు ఆగిపోయాయని అలాంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఆయన తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఒక్క రైతు భరోసాలో 13 నెలల్లో 10,200 కోట్లు చెల్లించామన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 87 వేల కోట్ల రుణమాఫీ చెల్లించాల్సి ఉండగా 15 వేల కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.