ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 12:36 PM IST
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

Updated On : March 11, 2020 / 12:36 PM IST

ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.  

660 జెడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు 21న పోలింగ్‌, 24న కౌంటింగ్:
ఏపీలో 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి రోజు బుధవారం నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాలు సందడిగా మారాయి. గురువారం(మార్చి 12,2020) ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 13న  నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. ఇక గెలుపు వ్యూహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి.

రాష్ట్రంలో 2,82,15,104 మంది ఓటర్లు:
రాష్ట్రంలో 2 కోట్ల 82 లక్షల 15 వేల 104 మంది ఓటర్లు ఉండగా.. 33 వేల 663 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది. అయితే వీటిలో 10 వేల 487 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవి కాగా.. 11వేల 251 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికలకు మొత్తం 2 లక్షల మందికి పైగా పోలింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నారు.
 

పట్టణ, నగర పాలక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ: 
ఇక పట్టణ, నగర పాలక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 75 మున్సిపాలిటీలకు, 12 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒకే విడతలో మార్చి 23న ఎన్నికలు జరుగుతాయి. 27న ఓట్ల లెక్కింపు చేపడతారు.  

రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు:
ఇక రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు మార్చి 17 నుంచి 19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19 నుంచి 21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలతో ఏపీలో హడావుడి మొదలైంది. అన్ని పార్టీలూ సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.