అమల్లోకి పెరిగిన AP ఆర్టీసీ బస్ చార్జీలు

  • Published By: chvmurthy ,Published On : December 10, 2019 / 01:00 PM IST
అమల్లోకి పెరిగిన AP ఆర్టీసీ బస్ చార్జీలు

Updated On : December 10, 2019 / 1:00 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

సవరించిన ఛార్జీల ప్రకారం.. పల్లె వెలుగు బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు వరకు  అంటే 10 కిలోమీటర్ల లోపు ఛార్జీలను పెంచలేదు. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 ఛార్జీ పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చొప్పున పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు. 

సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీలు పెంపుదల లేదు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. విడిభాగాలు, జీత భత్యాల వల్ల మరో రూ.650 కోట్ల భారం పడుతోందన్నారు. నష్టాన్ని భర్తీ చేసేందుకే ఆర్టీసీ ఛార్జీలు పెంచామని, ప్రజలు అర్థం చేసుకుని ఆర్టీసీని ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.