బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు..? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం.

Bandi Sanjay Kumar
Bandi Sanjay : బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే.. వారిని చెప్పుతో కొట్టండి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఈ మేరకు బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన. అంతేకాదు.. పొత్తు ఊసెత్తితే బీజేపీ కార్యకర్తలు తమను వెంటపడి కొట్టేటట్లున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆయన నిప్పులు చెరిగారు.
”అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోంది. బీజేపీకి రాముడున్నాడు, మోదీ ఉన్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. హిందుత్వం మాట్లాడలేని నాడు రాజకీయాల నుండి తప్పుకుంటా” అని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
Also Read : బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు