Basavaraj Bommai : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
Basavaraj Bommai : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, 65 స్థానాలతోనే సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది బీజేపీ.

Basavaraj Bommai(Photo : Google)
Basavaraj Bommai Resign : కర్నాటక ముఖ్యమంత్రి పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన తన పదవికి రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు అందజేశారు.
ఇవాళ కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, 65 స్థానాలతోనే సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది బీజేపీ. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ పార్టీ నేతలు డీలా పడిపోయారు. గెలుపుపై కమలనాథులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే, కన్నడ ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
శనివారం సాయంత్రం తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు బస్వరాజ్ బొమ్మై. తన రాజీనామా ఆమోదం పొందిందని బొమ్మై తెలిపారు. ఎన్నికల రిజల్ట్స్ పై బొమ్మై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామన్నారు.
ఇక, 2024 లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాడుదామన్నారు. కాంగ్రెస్ వ్యూహాలను చేధించడంలో తాము విఫలమయ్యామన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని, ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. 136 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక, ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కలలు కన్న జేడీఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు కన్నడ ఓటర్లు. జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.