KCR : కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, సమైక్య పాలకులే నయం, నేను గెలిచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని- కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే దాన్ని ఏదో బూతద్దంలో పెట్టి బద్నాం చేస్తున్నారు. రెండు మూడు రోజులు తర్వాత టీవీ డిబేట్ లో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను.

KCR : కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, సమైక్య పాలకులే నయం, నేను గెలిచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని- కేసీఆర్

KCR Slams CM Revanth Reddy Administration

KCR : కరీంనగర్ సభలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పాలనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన.. సమైక్య పాలకుల పాలన కంటే దారుణంగా ఉందని వాపోయారు కేసీఆర్.

‘పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండుతున్నా.. పాలకులకు దయ కలగడం లేదు. 3 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే.. సమైక్య పాలకులే నయం అనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. మొన్ను నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గి రాజేసే వాడిని. అందరినీ చైతన్యం చేసే వాడిని’ అని కేసీఆర్ అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి కాంగ్రెస్ కు వాత పెట్టాలని కేసీఆర్ అన్నారు. మాయ మాటలతో మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతుబంధు, తులం బంగారం అని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యమని రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు అని ధ్వజమెత్తారు కేసీఆర్. ఇంకో ఆయన మానవ బాంబు అయితా, పేగులు మెడలో వేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఇదే భాషనా మాట్లాడేది? నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి భాష ఎన్నడూ మాట్లాడలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.

‘తెలంగాణ ఉద్యమంలో పదవులు వదిలి పిడికిలి మందితో నేను కదిలాను. ఒక్కడినై కరీంనగర్ SRR మైదానంలో కార్యాచరణ చేసి ఉద్యమంలో బయల్దేరాను. ఆనాడు ఎంపీ పదవి విసిరికొట్టి కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చాను. ఉద్యమాన్ని ఉధృతం చేశాను. మొన్న మీరు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. ఆరు చందమామలను చూపెట్టారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడో ఓ మంత్రి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడతా. ఉద్యమ సమయంలో మాత్రమే నేను అలా మాట్లాడాను. అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లా మాట్లాడలేదు.

లంకె బిందెల కోసం వచ్చానని నేను ఏనాడైనా అన్నామా? మాతో పోటీ పడేలా పాలన చెయ్. బొంద పెడతాం అంటావా? అహోరాత్రులు కష్టపడి ఆలోచన చేసి 2014 నుంచి 19 వరకు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇచ్చాను. మేము అమలు చేసిన పథకాలు సక్కగా అమలు చేసే దమ్ము లేదా? రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ ది. ఎవడ్డన్న ముఖ్యమంత్రి లంకె బిందెలు లేవు అని అంటడా?

తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి దిక్సూచి కావాలని ఎంతో కృషి చేసి పదేళ్లు అభివృద్ది పథంలో తీసుకెళ్లా. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని ఛాలెంజ్ చేసిన. ఇవ్వాళ ఉన్న ప్రభుత్వానికి పథకం నడిపే సోయి లేదు. రోనా వచ్చి కాటు వేస్తే… రైతు బంధు ఎన్నడూ కేసీఆర్ ఆపలేదు. బీఆర్ఎస్ తీసుకుని వచ్చిన పథకాలను అమలు చేయటం చేతకాని ప్రభుత్వం ఉన్నది. అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాకు ఓటు వేసుకోని గెలిపించుకోవాలి. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి? బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలికనే లేదు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ 5 రూపాయలు కూడా తేలేదు.

కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఎకరం ఎండలేదు. ఇవ్వాళ బిమార్ వచ్చింది. రైతు చనిపోతే రైతు భీమా తెచ్చినాము. ఇవ్వాళ దాని గురించి మాట్లడే పరిస్థితీ లేదు. కేసీఆర్ ఎక్కువ, తక్కువ మాట్లాడడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే దాన్ని ఏదో బూతద్దంలో పెట్టి బద్నాం చేస్తున్నారు. రెండు మూడు రోజులు తర్వాత టీవీ డిబేట్ లో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను.

బీఆర్ఎస్ బలం తెలంగాణ గళం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మూడు, నాలుగు నెలల పాటు వేచి చూడమని నేనే చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా లేవు కాబట్టి మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 60ఏళ్ల స్వాతంత్ర భారతంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయాలని రైతు బంధు, రైతు భీమా తెచ్చా. ఇవ్వాళ పంటలు ఎండి పోతున్నాయి. చేనేత కార్మికులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు ఏదో తమాషా కోసం వెయ్యకూడదు. తెలంగాణ సంపద ఢిల్లీకి మోసుకు పోతున్నారు. మూడు నెలల్లో 9సార్లు ఢిల్లీకి వెళ్లారు.

ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే దేశంలో అగ్గి రాజేసే వాడిని. చిన్న దెబ్బ తగిలింది ఏమీ కాదు. పోలీస్ సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధిస్తున్నారు. పోలీసోళ్ళకి రాజకీయాలు అవసరం లేదు. అధికారం శాశ్వతం కాదు. ఒక్కడో, ఇద్దరో పార్టి మారితే కొన్ని టీవీలు బీఆర్ఎస్ పని అయిపోయిందని హడావిడి చేస్తున్నాయి. జాగ్రత.

కాంగ్రెసోళ్ల నోటికి మొక్కాలి. నాకు తిట్లు రావా? మానవ బాంబు అనొచ్చా? చీరుతా, పండబెట్టి తొక్కుతా అనొచ్చా? మీ ప్రభుత్వం మీద మాకు ఈర్ష్య లేదు. లంకె బిందెలు అని మాట్లాడొచ్చా? కరెంట్, రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ కు ఓటేస్తే ఎగనామం పెడతారు” అని కేసీఆర్ అన్నారు.

Also Read : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు