Brs : చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు, రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి- బీఆర్ఎస్ నేతలు ఫైర్

ఒక సామాజికవర్గం అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత త్వరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. రాజకీయమే పరమావధిగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.

Brs : చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు, రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి- బీఆర్ఎస్ నేతలు ఫైర్

Brs : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాటల యుద్ధానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. సీఎం తీరు తెలంగాణకు శాపంగా మారిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఏపీకి లబ్ది చేకూరేలా రేవంత్ వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. ఆరు నెలల్లో రేవంత్ చెల్లని చిత్తు కాగితంగా మారవచ్చన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. రేవంత్ కు దమ్ముంటే హామీలు అమలు చేయాలన్నారు. ”సీఎం మరోసారి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు. రైతులకు అండగా ఉండాలని కేసీఆర్ బయటకు వచ్చారు. అందుకే, గాయత్రి పంప్ ఆన్ చేశారు. రాష్ట్రం చేసిన అప్పులు ముందుగా తెలియవా?” అని దాసోజు శ్రవణ్ అడిగారు.

పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి
సుందిళ్ళ, అన్నారం నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు బాధ్యతలను విస్మరించారు. కాంగ్రెస్ నేతలది బాధ్యతారాహిత్యం కాదా? ప్రజల గురించి ఆలోచించని నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది.

గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే
ప్రజల అభిప్రాయాలను మేము కేసీఆర్ దృష్టికి తెస్తే కేసీఆర్ బయటకు వచ్చారు. రైతు రుణమాఫీ, రైతుబంధు అమలు కావడం లేదు. నీరు, కరెంట్ అందుబాటులో ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వ్యవసాయంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదు? పంట నష్టం ఇస్తారో లేదో సమాధానం చెప్పాలి. లేదంటే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ లో అంతా దొంగలే ఉన్నారు. రాడిషన్ హోటల్లో మీ పార్టీ నేత ఎలా పట్టుబడ్డారు? డ్రగ్స్ కేసులో మీ ఎంపీ అభ్యర్థి దొరికారు.

బాల్క సుమన్, మాజీ ఎంపీ
మేము ఆవేదనతో మాట్లాడుతున్నాము. ప్రజలు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హామీల అమలుకు డేట్లు, డెడ్ లైన్లు కాంగ్రెస్ ప్రకటించింది. మేము ఇప్పటివరకు అవే గుర్తు చేస్తున్నాము. ఇంత త్వరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. రాజకీయమే పరమావధిగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ బయటకు వస్తే నాగార్జున సాగర్, గాయత్రీ పంప్ హౌస్, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వచ్చాయి. యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు కేంద్రాలు తగ్గిస్తోంది. రైతుబంధు నిధులు రేవంత్ ఢిల్లీకి కప్పం కట్టారు. ప్రభుత్వం మీదే, ఏదైనా విచారణ చేసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

రేవంత్ లీక్ వీరుడిగా మారారు. ఫోన్ ట్యాపింగ్ లో డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఉన్నతాధికారులను ఎందుకు విచారణ జరుగలేదు. ఒక సామాజికవర్గం అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సీఎంగా హుందాగా వ్యవహరించడం మంచిది. ప్రజలు ఆసహ్యించుకుంటున్నారు. మీ పదవికి మేము గౌరవం ఇస్తున్నాం. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ఎందుకు మీ పార్టీలో చేర్చుకున్నారు? రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి?

కడియం శ్రీహరికి పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది. కడియం పార్టీ నుంచి వెళ్లేందుకు ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కడియంను చూస్తే అవకాశవాదం సిగ్గు పడుతుంది. నీతి మాటలు ఆయన ఎన్నో చెబుతారు. వరంగల్ లో కాంగ్రెస్ డిపాజిట్ పోవడం ఖాయం. బీఆర్ఎస్ నేతలను విమర్శించే అర్హత ఉందా? కడియం శ్రీహరి.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచారు. కాశీకి పోయే రోజుల్లో పార్టీకి వెన్నుపోటు పొడుస్తారని ఎవరూ ఊహించలేదు. కేకే ఎందుకు పార్టీ మారారు? కడియం శ్రీహరి, దానం నాగేందర్, విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేయాలి. మీరు చేసిన చర్యలు సరైనవే అయితే ప్రజాతీర్పు కోరాలి. కడియంపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తాం. నీతిమంతుడివని కడియం రాజీనామా చేసి నిరూపించుకోవాలి. వరంగల్ లో ఆంధ్ర కావ్యకు ఓట్లు పడతాయా?

Also Read : తెలంగాణలో వలసల రాజకీయం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఆత్మగౌరవం ఉన్నట్లా?