రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ దాడులు

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని నివాసంతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లోని ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం, డిసెంబర్31 ఉదయం అధికారులు ఏకాకాలంలో తనిఖీలు చేస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివరాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.
వివిధ బ్యాంకులనుంచి రాయపాటి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించకుండా ఎగ్గొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గతంలో పోలవరం ప్రాజెక్టు పనులను చేసింది. గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సోదరులది ప్రత్యేకమైన స్థానం. రాయపాటి సాంబశివరావు రాజ్యసభ సభ్యుడిగా, గుంటూరు, నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు చిత్రమైన మలుపులు తిరుగాయి. టీడీపీ నేతలు అనేకమంది పక్కచూపులు చూసారు. అవకాశం ఉన్నవారు వైసీపీ లోకి వెళ్లగా మిగిలిన వారు కమలదళం లోకి చేరారు. ఈ సమయంలో రాయపాటి సాంబశివరావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలుచేసినా అవి ఫలించలేదు. అక్కడ ఆయనకు అనుకూలమైన రాజకీయ వాతావరణం ఉండదని ఆయన అనుచర వర్గం భావించింది.
ఎందుకంటే రాయపాటి సాంబశివరావుకు రాజకీయంగా బద్ధశత్రువైన కన్నా లక్ష్మానారాయణ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనూ, ఆ తరువాత కూడా రాయపాటి, కన్నాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరముంది.దీంతో రాయపాటి బీజేపీ అధిష్టానానికి టచ్ లో ఉన్నారు.
మంగళవారం ఉదయం 6 గంటలకే వచ్చిన సీబీఐ బృందాలు.. ఇంకా సోదాలు చేస్తోంది. సోదాల సమయంలో రాయపాటి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా… గుంటూరు నివాసంలో ఆయన కుమారుడు రంగబాబు ఉన్నారు.