విజయసాయి లేఖకు స్పందించిన అమిత్ షా

హైదరాబాద్ లో సీబీఐ జేడీగా ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు. ఈ మేరకు అమిత్ షా విజయసాయి రెడ్డికి శనివారం లేఖ రాశారు.
కాగా…. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 2019,డిసెంబర్ 30 న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీబీఐ జేడీ నియామకం పై ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ….. ‘ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ, చంద్రబాబునాయుడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారు.
ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మీ నారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఇబ్బందులు సృష్టించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగింది. లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.
ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే.
ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారు. చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్‌లో నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ సీబీఐ జేడీగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాల’ ని కోరారు. ఈ లేఖకు స్పందిస్తూ అమిత్ షా తగిన చర్యలు తీసుకోవాలనికేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు.