దళితులను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు స్కెచ్, కీలక పదవి ఇస్తారట

తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసేందుకు జాబితాలు రెడీ చేసేశారట. రాష్ట్ర కార్యవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు.
కులాల సమతుల్యతలు దెబ్బతినకుండా ఉండేందుకు వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట చంద్రబాబు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక కీలక చర్చ జరుగుతోందని అంటున్నారు. రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుకు తోడుగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ని నియమిస్తే ఎలా ఉంటుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
తెలంగాణలో ఎల్ రమణ, రేవంత్ రెడ్డి..మరి ఏపీలో:
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఓసీ. పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బీసీ, ప్రస్తుతం తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఎల్.రమణ బీసీ. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక ఎస్సీని నియమిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
గతంలో తెలంగాణలో ఎల్.రమణకి తోడుగా రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి లాభం జరుగుతుందనే చర్చ సాగుతోంది. దశాబ్దకాలంగా పార్టీతో కలిసి రాని వర్గాల్లో ఈ నిర్ణయం ద్వారా కొంత మార్పు వస్తుందని టీడీపీ సీనియర్ నేతలు చెప్పుకుంటున్నారు.
ఎస్సీ నేత కోసం చంద్రబాబు సెర్చింగ్:
ప్రస్తుతం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌లా వ్యవహరించే స్థాయి ఉన్న ఎస్సీ నేతలు ఎవరా అనే వెదుకులాట ప్రారంభమైంది. ఎస్సీలకి గనక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనుకుంటే ముందుగా కనిపించేది వర్ల రామయ్య అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత దగ్గర ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
వర్ల రామయ్య 2005 నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. అప్పటి నుంచి పార్టీ జనరల్ సెక్రటరీగా అనేక జిల్లాలకు ఇన్‌చార్జిగా పని చేశారు. 2009లో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. గత ఎన్నికల్లో వర్లకి పోటీ చేసే అవకాశం రాలేదు.
వర్లకు రాజ్యసభ స్థానం తృటిలో మిస్:
2019 ఎన్నికల ముందు వర్ల రామయ్యకు రాజ్యసభ స్థానం ఖరారు అయినట్టే అయి మిస్సయింది. అధినేతకు నమ్మకస్తుడైన నేతగా పేరుంది. ప్రస్తుతం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు అడ్వాంటేజ్.
మొదటి నుంచి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులకు, జాతీయ ఎస్సీ, మానవహక్కుల కమిషన్లకు లేఖలు రాస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.
వర్ల రామయ్య సరైనోడు:
అధికార పార్టీకి ఏమాత్రం భయపడకుండా ఎలాంటి విమర్శనైనా చేసే వర్ల రామయ్యను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే పార్టీకి లాభం జరుగుతుందని కొందరు అధినేత వద్ద స్పష్టం చేశారట. రామయ్య బాడీ లాంగ్వేజ్, వాయిస్, అన్ని విధాలుగా సరైనోడు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
https://10tv.in/samyuktha-hegde-files-complaint-against-kavitha-reddy-for-abuse-and-assault/
పార్టీలో ఎక్కువ మంది నేతలు మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారట. వర్ల రామయ్య మాత్రం తనకు అవకాశం ఇస్తే ఇంకా లాయల్‌గా పని చేస్తానని చెబుతున్నారట. మరి అధినేత ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?