టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 03:22 PM IST
టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు 

భద్రాద్రి కొత్తగూడెం : టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో అనైక్యత, ఆధిపత్యం ఒక్కసారిగా బహిర్గతమైంది. అశ్వారావుపేట మండలం వినాయకపురంలో టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇంచార్జీ కీళ్లపాటి రవీందర్ ప్రసంగాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఓటమికి కారణాలు తేల్చకుండా సమావేశం జరపనివ్వం అంటూ ఆందోళన చేపట్టారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులకు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ ఎస్ ఘోర పరాజయం పాలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 6న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనాల్సివుంది. సమావేశంలో తుమ్మల ఆలస్యంగా పాల్గొన్నారు. పొంగులేటి మాత్రం పాల్గొనలేదు. 

స్థానిక సంస్థలకు పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కీళ్లపాటి రవీందర్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగా ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకపక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేస్తుంటే..మరో పక్క తాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని ఎంపీ వర్గీయులు నినాదాలు చేశారు. ఇరు వర్గాలు వాదోపవాదాలు చేసుకున్నారు. తాటి వెంకటేశ్వర్లు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టీఆర్ ఎస్ ను గెలిపించుకోవాలని తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.