కడప నేతలతో చంద్రబాబు భేటి.. అభ్యర్ధులు వీరేనా!

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 10:03 AM IST
కడప నేతలతో చంద్రబాబు భేటి.. అభ్యర్ధులు వీరేనా!

అమరావతిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాజంపేట అసెంబ్లీ పరిధిలోని నేతలతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాజంపేట అసెంబ్లీ అభ్యర్ధి ఎంపికపై నేతలతో సంప్రదింపులు జరిపారు. క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వాలని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అసంతృప్తి నేతలకు చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశం అయ్యారు. 
  

కడప జిల్లాలో కూడా సీఎం అభ్యర్ధులను ఖరారు చేసినట్లు సమాచారం. కడప పార్లమెంట్ స్థానానికి మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఖరారు చేయగా.. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో పాగా వేయాలని టీడీపీ గట్టిగా టార్గెట్ పెట్టారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు బాబు.  రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, జమ్మల మడుగు నుంచి రామసుబ్బారెడ్డిని ఇప్పటికే ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 

అలాగే రాయచోటి నుంచి రమేష్‌ కుమార్‌ రెడ్డి, రైల్వేకోడూరు నుంచి టి.నరసింహ ప్రసాద్‌(చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు)ను ఎమ్మెల్యేలుగా బరిలో దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి త్వరలో తెలుగుదేశంలో చేరనున్న మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్‌కు అవకాశం ఇవ్వనున్నారట. కమలాపురం సీటు విషయానికి వస్తే పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరశివారెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక బద్వేల్‌ అసెంబ్లీ విషయానికి వస్తే లాజరస్‌ పేరును పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కడప జిల్లాకు మసంబంధించి క్లారిటీని చంద్రబాబు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?
Read Also:దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు
Read Also:ప్రియాపై ఫైర్ అవుతున్న లవర్స్ డే హీరోయిన్