రెండు మూడు నెలలు జైల్లో పెట్టినా హ్యాపీగా వెళ్తా- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

మేము ఏమో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాం. మీరేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేశారు.

రెండు మూడు నెలలు జైల్లో పెట్టినా హ్యాపీగా వెళ్తా- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR

Updated On : November 7, 2024 / 8:10 PM IST

KTR : తన అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రచారంపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో పెడితే పెట్టుకోండి అని కేటీఆర్ అన్నారు. తాను జైలుకి వెళ్లేందుకు సిద్ధమన్నారాయన. రెండు మూడు నెలలు తనను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతాను అంటే.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు. మంచిగా జైలుకి వెళ్తానన్నారు. అక్కడ యోగా చేసుకుని, ట్రిమ్ గా బయటకు వచ్చి పాదయాత్రకు వెళ్తాను అని కేటీఆర్ అన్నారు.

ఇక, హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ కోసం రూ.55 కోట్లు ట్రాన్సఫర్ చేసింది నిజమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ నిధులను తాను తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసలు ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఏమైందో తెలియదన్నారు కేటీఆర్.

అరెస్ట్ చేసుకో.. జైల్లో పెట్టుకో…
”కేసు పెడతా, ఏమో చేస్తా అంటున్నారు. మీకు ఇష్టమున్న కేసు పెట్టుకోండి. అరెస్ట్ చేసుకోండి. నాకేమీ ఇబ్బంది లేదు. రెండు నెలలో, మూడు నెలలో నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతాను అంటే.. నాకేమీ అభ్యంతరం లేదు. మంచిగా జైలుకి పోతా. యోగా చేసుకుంటా. స్లిమ్ గా బయటకు వస్తా. పాదయాత్రకు వెళ్తా. నేను భయపడేవాడిని కాదు. ఈ ఉడత ఊపులకు భయపడను. రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. గాసిప్స్ పక్కన పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు. మీ చర్యల వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటోంది”.

రూ.55 కోట్లు ఇచ్చాం..
”ఎన్నో ఈవెంట్లకు ప్రభుత్వం ఫండ్ చేస్తుంది. అది ప్రభుత్వం విచక్షణ. అది సర్కార్ తీసుకున్న డెసిషన్. నగరం ఇమేజ్ పెంచేందుకు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తప్పు ఏముంది? అసలు రేవంత్ రెడ్డిది తప్పు. రేవంత్ రెడ్డి ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం వల్ల నష్టం జరిగింది. పోయిన ఏడాది హైదరాబాద్ కు 700 కోట్ల రూపాయల లాభం వస్తే.. ఇవాళ మీ దిక్కుమాలిన నిర్ణయం వల్ల 800 కోట్ల నష్టం వచ్చింది”.

ఎక్కడా కరప్షన్ లేదు..
”ఏసీబీని ఎప్పుడు వాడాలి. అవినీతికి యాంటీగా వాడాలి. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది? నేను అడుగుతున్నా. 55 కోట్ల రూపాయలు పంపిన మాట వాస్తవం. ఎందుకు పంపాం. హైదరాబాద్ లో రేసు జరగాలని పంపాం. అందులో నాకు ఏమైనా వచ్చాయా? నేను ఏమైనా దాచుకున్నానా. ఎవరి మీద పెట్టాలి కేసు. హైదరాబాద్ కు నష్టం కలిగించినందుకు రేవంత్ రెడ్డి మీద, తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్న ఆయన నాయకత్వం వహించిన మున్సిపల్ శాఖ మీద కేసు పెట్టాలి. ఇచ్చిన కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి పైసలు మిగతావి కట్టక.. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి, సిగ్గు చేటు పని చేసిన మీపైనే కేసు పెట్టాలి. ఇలా చేస్తే ఎవరైనా పెట్టుబడులు పెడతారా?”

మాది బ్రాండ్.. మీది బ్యాడ్..
”మేము ఏమో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాం. మీరేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. హైడ్రా పేరుతో దుకాణం పెట్టారు. బ్లాక్ మెయిల్ దందా చేస్తున్నారు. మీ చర్యల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్ లో ఇవాళ ఏదైనా కొనేందుకు ప్రజలు భయపడుతున్నారు. నేను చెప్పేది వాస్తవం కాదా? విశ్వ నగరం విజన్ దెబ్బతీస్తున్నది రేవంత్ రెడ్డి. ఇలా అయితే హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తాయా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాగానే చేసే పనులు ఇవేనా? ఎయిర్ పోర్టు మెట్రో రద్దు, ఫార్ములా వన్ రేసు రద్దు, ఫార్మా సిటీ రద్దు.. ఇలాంటి నిర్ణయాలతో పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా? పాపం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధపడుతున్నారు. మాకు అప్పు కూడా పుట్టడం లేదని ఆయన వాపోతున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడితే అప్పు ఎక్కడి నుంచి పుడుతుంది?” అని నిలదీశారు కేటీఆర్.

 

Also Read : మేము మంత్రులం కాదా, మాకు వాడే అర్హత లేదా? హెలికాప్టర్ కోసం లొల్లి..