ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి : షర్మిల

గుంటూరు : ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి లని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్లేనని తెలిపారు. వైసీపీ నవరత్నాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని తెలిపారు. పెదకూరపాడులో ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగించారు.
చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని పసుపు-కుంకుమ అంటూ.. మరోసారి చంద్రబాబు మోసం చేయలనుకుంటున్నారని.. ఎవరూ మోసపోవద్దన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించిన చంద్రబాబు.. పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారని, ఆయన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏ ఆస్పత్రికి వెళ్తారని ప్రశ్నించారు.
బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. పప్పుకు వర్థంతికి జయంతికి తేడా తెలియదని, ఏ అర్హత ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారని ప్రశ్నించారు. మాములు ప్రజలకు ఉద్యోగాల్లేవని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారని తర్వాత ప్యాకేజని, ఇప్పుడు హోదా అంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు.. మోడీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని మండిపడ్డారు. ‘మళ్లీ ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యతని చంద్రబాబు అంటున్నారని ఆయన చేతిలో భవిష్యత్ పెడితే నాశనమేనని స్పష్టం చేశారు.