ఓటరుతో పాటు క్యాడర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా..

అందరిపైనా ప్రతీకారం తీర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు మనోహర్‌రెడ్డి అనుచరులు. ఎందరు ఏమన్నా... నా మాటే శాసనం అన్నట్లు వ్యవహారిస్తున్నారట మనోహర్‌రెడ్డి. మొత్తానికి ఈ పొలిటికల్‌ రివేంజ్‌ విస్తృత చర్చకు దారితీస్తోంది.

ఓటరుతో పాటు క్యాడర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే..! ఎందుకో తెలుసా..

Gossip Garage : తమ రాజకీయ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకునే పొలిటీషియన్స్‌ను చాలా మంది చూసే ఉంటారు. కానీ, ఓటర్లు, వెనక తిరిగిన క్యాడర్‌పై రివేంజ్‌ తీర్చుకునే నేతలను ఎప్పుడైనా చూశారా? చూడలేదు కదా… ఈ స్టోరీ అలాంటిదే… మీకెంతో చేశాను…. చాలా చేస్తానని మాటిచ్చాను. కానీ, నన్నే ఓడిస్తారా? మీకెంత ధైర్యం… నా ఓటమికి ఫలితం మీరు అనుభవించాల్సిందేనంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధి… ఓటర్లతోపాటు తన వెనక తిరిగిన కార్యకర్తలను కూడా ముప్పతిప్పలు పెడుతున్నారట. ఓటు వేసిన వారు, వేయని వారు అన్న తేడా లేకుండా…. పాత బాకీలు కూడా వసూలు చేస్తున్నారు ఆ మాజీ నేత.

ఓటమి తర్వాత ఓటర్‌తోపాటు క్యాడర్‌ పై రివెంజ్..
ఏడు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి… ఓటర్‌తోపాటు క్యాడర్‌కు షాకులిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మనోహర్‌రెడ్డి… తన విద్యాసంస్థలతో ప్రజలకు సేవ చేస్తున్నానని గతంలో చెప్పుకునేవారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత సేవా… గీవా జాన్తా నై… పక్కా కమర్షియల్‌.. రూల్‌ ఈజ్‌ రూల్‌ ఫర్‌ ఆల్‌ అంటూ ప్లేటు తిప్పేశారు. మాజీ ఎమ్మెల్యేలో సడన్‌గా వచ్చిన మార్పుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల్లడిల్లిపోతున్నారట…. ఎన్నికల్లో తన ఓటమి కారణమయ్యారనే ఆలోచనతోనే మాజీ ఎమ్మెల్యే ఇలా రివేంజ్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది.

మొహమాటం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనని ఆదేశం..
హ్యాట్రిక్‌ సాధిస్తానని గంపెడాశలతో గత ఎన్నికల్లో బరిలోకి దిగిన మనోహర్‌రెడ్డికి ఓటర్లు షాక్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ఇస్తున్న రివర్స్‌ షాక్‌తో ఓటర్లు కంగుతింటున్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమికి మారిన రాజకీయ పరిణామాలు ఒక కారణమైతే, తన క్యాడర్ పుల్ సపోర్ట్ చేయకపోవడం, నమ్మిన వాళ్లు చివరి నిమిషంలో ఇతర పార్టీలో చేరి హ్యాండిచ్చారని ఆవేదన చెందిన మనోహర్‌రెడ్డి…. నమ్మితే మోసం చేస్తారా? అనుకున్నారో ఏమో… తనకు సహకరించని వారిపై రివేంజ్ తీసుకోవాలనుకుని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన విద్య సంస్థల్లో ఫీజు రాయితీ పొందిన వారికి… ఇప్పుడు నో కన్సిషన్ అంటున్నారట. మొహమాటం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనంటూ విద్యా సంస్థల సిబ్బందిని ఆదేశించారట మనోహర్‌రెడ్డి.

ఫీజుల్లో రాయితీలు కట్, పాత బకాయిలు కూడా వసూలు చేయాలని ఆదేశాలు..
మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రాజకీయాల్లో రాక ముందు ట్రినిటీ విద్యా సంస్థల అధినేతగా ఉండేవారు. 2014కు ముందు బీఆర్ఎస్‌లో చేరి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనుకుని… క్యాడర్, లీడర్ ఏది అడిగినా కాదనకుండా చేసేవారు మనోహర్‌రెడ్డి. తన విద్యా సంస్థల్లో చదివే కార్యకర్తల పిల్లలకు ఫీజు రాయితీలిచ్చేవారు. దీంతో క్యాడర్‌ కూడా ఎవరికి ఎంత కావాలో అంతలా వాడుకున్నారు. ఎన్నికల నాటికి క్యాడర్ వ్యవహరించిన తీరు… ఫలితాలు తారుమారు కావడంతో చిర్రెత్తిన మనోహర్‌రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఇంతకాలం ఇచ్చిన ఫీజుల్లో రాయితీ లేవంటూ తేల్చిచెప్తున్నారట. పాత బకాయిలు కూడా వసూలు చేయాలంటూ సిబ్బందికి సూచించారని అంటున్నారు.

ఓటమితో రాజకీయాలకు దూరం…
గతంలో యాక్టివ్‌ పాలిటిక్స్‌లో తిరిగిన మనోహర్ రెడ్డి… ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విద్యా సంస్థల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో తన విద్యాసంస్థల్లో తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే మనోహర్‌రెడ్డి… ఇప్పుడు ఎవరినీ కలవడం లేదు. ఫీజు రాయితీ కావాలని ఎవరూ తన ఛాంబర్ వద్దకు రాకుండా బ్రేక్‌ వేశారంటున్నారు. అర్హులైన వారికి రాయితీలు ఇస్తున్నామని చెప్పుకుని… ఇప్పుడు ఓడిపోయామనే కారణంతో పిల్లల ఫీజులను ముక్కు పిండి వసూలు చేయడం ఎంతవరకు న్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు.

పదవి పోయిందని ప్రతీకారం తీర్చుకోవడమేంటి?
ఎన్నికల సమయంలో క్యాడర్ షాకిస్తే… ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రివర్స్‌ అటాక్‌ ఇవ్వడం బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను బిత్తరపోయేలా చేస్తోంది. పదవి పోయిందని అందరిపైనా ప్రతీకారం తీర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు మనోహర్‌రెడ్డి అనుచరులు. ఎందరు ఏమన్నా… నా మాటే శాసనం అన్నట్లు వ్యవహారిస్తున్నారట మనోహర్‌రెడ్డి. మొత్తానికి ఈ పొలిటికల్‌ రివేంజ్‌ విస్తృత చర్చకు దారితీస్తోంది.

Also Read : కాంగ్రెస్‌లో చేరాక సౌండే లేదు..! జంపింగ్‌ ఎమ్మెల్యేల మౌనానికి కారణం ఆ భయమేనా?