Gossip Garage : బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికలో రోజుకో ట్విస్ట్.. మారుతున్న ఈక్వేషన్లు, రేసులో కొత్త కొత్త పేర్లు..
జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావొస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిందట.

Gossip Garage : సెలక్షన్ కంప్లీట్. అనౌన్స్‌మెంటే లేటు. ఏ టైమ్‌లోనైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన వస్తుందన్నారు. కట్ చేస్తే క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లాగా రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. కాషాయ రథసారధి రేసులో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇవాళ రేసులో ఉన్న నేత రేపు వెనకబడి పోతున్నారు. ఆశావహుల లిస్ట్‌లో లేని నేత కొత్తగా తెరమీదకు వస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ లెవల్‌లో రాష్ట్ర అధ్యక్ష రేసు తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ రేపుతోంది. అసలు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారు? కొత్తగా తెరమీదకు వచ్చిన నేతలు ఎవరు.?
సినిమాలో క్లైమాక్స్‌లో ట్విస్టులాగా తెరపైకి కొత్త కొత్త పేర్లు..
వడపోత కంప్లీట్ అయింది. ప్రకటన రావడమే ఆలస్యం అన్నట్లుగా కొనసాగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక..రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఈక్వేషన్‌లు మారుతున్నాయి. రేసులో కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న రేసులో ఉన్న నేత ఇవాళ వెనక బడిపోతున్నారు. ఇవాళ రేసులో ఉన్న లీడర్ రేపటివరకు ఆశావహుల లిస్ట్‌లో కూడా ఉండటం లేదు.
అంతేకాదు అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్న నేతల లిస్ట్‌లో అనూహ్యంగా మరికొందరు తెరమీదకు వస్తున్నారు. దీంతో సినిమాలో క్లైమాక్స్‌లో ట్విస్టులాగా కొత్త కొత్త పేర్లు.. కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మరింత జఠిలం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
నాలుగైదు నెలలుగా డైలీ ఎపిసోడ్..
ఆ మధ్య ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్‌లలో ఒకరికి రథసారధి పగ్గాలు దక్కడం ఖాయమన్న టాక్ వినిపించింది. ఆ తర్వాత బీసీ కోటాలో ఈటల రాజేందర్‌కు అవకాశం ఇస్తారన్న చర్చ జరిగింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. తాను ప్రెసిడెంట్ పదవి ఆశించడం లేదని చెప్తూనే..మరోసారి కాషాయ రథసారధి అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష రేసు నాలుగైదు నెలలుగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది.
Also Read : ఇప్పుడు వంశీ వంతు.. నెక్స్ట్ కొడాలి నానినేనా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?
అనూహ్యంగా తెరమీదకు ఎంపీ డీకే అరుణ పేరు..
తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రామచందర్ రావు, రఘునందన్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. పాత, కొత్త అనే విభేదాలు తలెత్తడంతో అధిష్టానం మధ్యేమార్గంగా మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అనూహ్యంగా ఎంపీ డీకే అరుణ పేరు తెరమీదకు వచ్చింది. ఈటల రాజేందర్, డీకే అరుణ ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెస్తున్నారట. బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇస్తే..ఈటల రాజేందర్ లేదా ధర్మపురి అర్వింద్‌లో ఒక్కరిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని చర్చ జరుగుతోంది.
ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌లో ఎక్కడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదు. మహారాష్ట్రలో ఈ మధ్యే ఓ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే..ఈసారి రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఎంత కష్టమైందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావొస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిందట. అధిష్టానం నియమించిన ఇంచార్జ్ శోభా కర్లెంజర్..పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. అంతకంటే ముందే ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ముందస్తు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడిదే అంశం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆయన అభిమానులు ఉత్సాహంతో అలా పోస్ట్ పెట్టి ఉంటారని లైట్ తీసుకుంటున్నారు కొందరు లీడర్లు. మరికొందరు మాత్రం దీని వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి పోస్ట్‌లు చేయించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎంపిక ఆలస్యం అవుతుండటమే అనవసరమైన చర్చలకు దారి తీస్తుందని అంటున్నారు పలువురు నేతలు. వీలైనంత త్వరగా రాష్ట్ర అధ్యక్షుడిపై ఓ నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో మరింత గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాషాయ రథసారధి అయ్యేదెవరు.? పార్టీ పగ్గాలు దక్కెదెవరికి అనేది వేచి చూడాలి.