తెలంగాణ బీజేపీలో పాత- కొత్త సమరం మళ్లీ మొదలైందా?

ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలు ఈ పదవిని ఆశిస్తుండగా, పార్టీలో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన మరో నేత కూడా పార్టీ చీఫ్‌ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

తెలంగాణ బీజేపీలో పాత- కొత్త సమరం మళ్లీ మొదలైందా?

Who Is Telangana Bjp Chief : తెలంగాణ బీజేపీలో పాత-కొత్త సమరం మళ్లీ మొదలైందా? పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై హైడ్రామా ఏంటి? కొత్తగా కమలదళపతి కావాలని కలలు కంటున్న నేతల మధ్య మాటల యుద్ధం దేనికి సంకేతం… బీజేపీ సిద్ధాంతాల సాకుతో కొత్తగా వచ్చిన నేతలకు ఎర్త్‌ పెడుతున్నారా? అధిష్టానం ఆలోచనలేంటి? స్థానిక నేతల అంతరంగమేంటి? తెలంగాణలో బీజేపీ చీఫ్‌ కావాలని ఆశపడుతున్న నేతలు ఎవరు? ఎవరికి అధ్యక్ష పీఠం దక్కబోతోంది?

ఈటలను కాదని కిషన్ రెడ్డికి బాధ్యతలు..
తెలంగాణ బీజేపీలో అధ్యక్ష మార్పు వ్యవహారం కొత్త చిచ్చుకు దారితీస్తోంది. గతంలో ప్రస్తుత కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చినప్పుడు ఎలాంటి రచ్చ జరిగిందో.. ఇప్పుడు కొత్త అధ్యక్షుడి నియామకానికి ముందు అంతేస్థాయిలో హైడ్రామా నడుస్తోంది. అప్పుడు కూడా కొంతమంది నేతలు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం సరికాదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయననే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బండిని తొలగించి ఎంపీ ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం ఈటలను కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది. అధ్యక్ష పదవి ఆశించిన ఈటలను ఎన్నికల కమిటీ చైర్మన్ చేసి.. వివాదాన్ని టీ కప్పులో తుఫాన్‌లా చల్లార్చేసింది.

ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్త నేతను ఎంపిక చేయడం అనివార్యం అయ్యింది. ఇక అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు రెండువర్గాలుగా విడిపోయి… తమ మనోభీష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటూ.. తమకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పుకుంటూ పార్టీలో సీనియర్‌ నేతల మద్దతు కోరుతున్నారు. మరోవైపు బహిరంగ సమావేశాల్లోనూ అధ్యక్ష పదవిపై వ్యాఖ్యలు చేస్తూ దుమారానికి తెరలేపుతున్నారు.

స్ట్రీట్ ఫైటర్ కావాలా? అంటూ ఈటల కౌంటర్..
దేశం కోసం.. ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసిన వారికి… అగ్రెసీవ్‌గా ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి. పార్టీలో విస్తృత చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో రాజాసింగ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ ఈటల రాజేందర్ ఒకింత ఘాటుగా స్పందించారు. నిన్నమొన్న ఒకాయన స్టేట్మెంట్ ఇచ్చారని.. ఫైటర్ కావాలన్న ఆ నేతకు ఏ ఫైటర్ కావాలి.. స్ట్రీట్ ఫైటర్‌ కావాలా అంటూ ప్రశ్నించారు ఈటల… అలాంటి స్టేట్మెంట్లకు నేను బాధపడను.. నీ చేతిలో అధికారం ఉన్ననాడు నీవెంతరా? అన్నవారు గొప్పవారు.. సందర్భం వస్తే జేజమ్మతో సైతం కొట్లాడే సత్తా ఉన్న వ్యక్తిని అంటూ తనకోసం తాను చెప్పుకున్న ఈటల…. అధిష్టానం తనకే అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టబోతోందన్న సంకేతాలిచ్చారు.

ఈటలది సెల్ఫ్ గోల్..?
మరోవైపు రాజాసింగ్‌, ఈటల వ్యాఖ్యలను పార్టీలో పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ఈటల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఎలాంటి అధ్యక్షుడైతే బాగుంటుందనే దానిపై తన అభిప్రాయం మాత్రమే రాజాసింగ్‌ చెప్పాడని అంటున్నారు కొందరు.. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై ఈటల స్థాయి నేతలు బహిరంగంగా స్పందించకుండా ఉండాల్సిందని రాష్ట్ర బీజేపీలోని ఓ కీలక నేత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాజాసింగ్ కామెంట్స్‌పైన అనవసరంగా ఈటల మాట్లాడి తప్పు చేశాడని అభిప్రాయం కలుగుతోందంటున్నారు. ఇప్పటివరకు ఈటలకు మద్దతుగా నిలిచిన బీజేపీలోని పాత నేతలు కొందరు… ఇది ఈటల సెల్ఫ్ గోల్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

మొత్తానికి రాజాసింగ్‌, ఈటల మధ్య డైలాగ్‌వార్‌ పార్టీ నూతన అధ్యక్షుడిపై ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలు ఈ పదవిని ఆశిస్తుండగా, పార్టీలో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన మరో నేత కూడా పార్టీ చీఫ్‌ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. హైదరాబాద్‌ నగరంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ నేతకే చాన్స్‌ ఇస్తారా? లేక దూకుడు చూపే నేతలకు అవకాశమిస్తారా? అన్నది వేచి చూడాల్సి వుంది.