జగన్ కు షాక్ : ఎమ్మెల్యే గౌరు చరిత జంప్

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 12:05 PM IST
జగన్ కు షాక్ : ఎమ్మెల్యే గౌరు చరిత జంప్

Updated On : February 22, 2019 / 12:05 PM IST

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి జగన్ తమను అవమానిస్తున్నారన్న భావనతో పార్టీని వీడేందుకు సిద్దం అయ్యారు. పాణ్యం అసెంబ్లీ టిక్కెట్ విషయంలో చివరి క్షణంలో హ్యాండిస్తారని అనుమానించిన ఆమె తెలుగుదేశం గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న జగన్.. పాణ్యం టిక్కెట్ ను ఆయనకు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే జగన్ అలా చేయరని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలో చేర్చుకున్న వారికి అవకాశం ఇవ్వరని ఇంత కాలం ఆమె భావించింది. కానీ పార్టీ కార్యక్రమాల్లో గౌరు దంపతులను జగన్ పట్టించుకోవడం మానేయడంతో కాటసాని రాంభూపాల్ రెడ్డికే టిక్కెట్ అన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మారేందుకు గౌరు దంపతులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 
    రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తులైన గౌరు కుటుంబం పార్టీకి దూరం అవడం వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.  గతంలో జైలు శిక్ష పడిన గౌరు వెంకటరెడ్డిని.. తను సీఎం అయిన కొద్ది కాలంలోనే క్షమాభిక్ష ఇప్పించి విడుదల చేయించారు వైఎస్. అందుకే ఆ తర్వాత వారు జగన్ వెంట నడిచారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గౌరు వెంకటరెడ్డి వ్యవహరించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

 

ఆ తర్వాత శిల్పా సోదరులు వైసీపీలో చేరారు. ఓ వైపు తమకు ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం మరో వైపు శిల్పా సోదరులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో జగన్ తత్వం తెలిసిన గౌరు దంపతులు తమను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నంలో జగన్ ఉన్నాడని భావిస్తున్నారు.