గృహప్రవేశం : ఏపీలో 4 లక్షల ఇళ్లు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదోడి పెద్ద కల ఎట్టకేలకు నెరవేరింది. ఇంటికి పెద్ద కొడుకునవుతానన్న చంద్రబాబు, పేదోడికి ఇల్లు ఇవ్వడం ద్వారా ఇచ్చిన మాటనూ నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లక్షలాది గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పేదల కళ్లలో పండుగను చూడటానికి సిద్ధమవుతున్నారు.
నెల్లూరు, తిరుపతి కేంద్రంగా సుమారు 4 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి నెల్లూరు కేంద్రంగా జరిగే గృహ ప్రవేశాల ఆనందోత్సవంలో స్వయంగా పాల్గొంటున్నారు. తిరుపతిలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనున్నది. రాష్ట్ర చరిత్రలోనే ఇంతకు పూర్వం, ఇక ముందూ మరే ముఖ్యమంత్రి కూడా కట్టలేని విధంగా చంద్రబాబు లక్షలాది ఇళ్లను పేదలకు అందిస్తున్నారు. తెలుగు ప్రజల అభిమాన ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశ పెట్టిన పేదల గృహ నిర్మాణ పథకాన్నిఎన్టీఆర్ స్పూర్తితోనే చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారు. పేద కుటుంబాల ఆర్థిక ప్రగతిలో ఎంతో ముఖ్యమైన శాశ్వత గృహ నిర్మాణంపైనే ముఖ్యమంత్రి ఎక్కువగా దృష్టి సారించారు. విభజన తరువాత రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నా సుమారు రూ.80 వేల కోట్లతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కలిపి అందరికీ 2022 నాటికి సుమారు 30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. గతంతో ఉన్న పథకాలతో కలిపి 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా 20లక్షల 18 వేల 390 గృహాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీనికి సుమారు రూ. 34,632 కోట్లు వ్యయం అవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో 11 లక్షల 21 వేల 619 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.
2019 ఫిబ్రవరినాటికి 8 లక్షల 70 వేల 175 గృహాలను అధికార యంత్రాంగం ఇప్పటి వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడం విశేషం. ఒక్కో గృహానికి గ్రాంటు రూపంలో రూ. 1.50 లక్షలు ఇవ్వడంతో పాటు షెడ్యూల్డ్ కులాల వారికి 50 వేల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల వారికి రూ. లక్ష వరకు అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నారు. స్థలాల కొరతను అధిగమించడానికి గతానికి భిన్నంగా పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపడుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలోని పలార్లపల్లెలో రూ.100 కోట్లతో జీ+3 బహుళ అంతస్తుల భవనాలను ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధం లేకుండా గత ప్రభుత్వాల హయాంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకూ 25 వేల అదనపు సబ్సిడీని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం ఇళ్ల నిర్మాణాలతోనే సరిపెట్టకుండా గత ప్రభుత్వాలకు భిన్నంగా నిర్మాణాలు జరుగుతున్న అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి సదుపాయాలకూ పెద్ద పీట వేసింది. పేదల ఇళ్ల స్థలాల భూ సేకరణకూ రూ .500 కోట్లు ఖర్చు చేసింది. ప్రీ ఎన్టీఆర్ ఇళ్ల కోసం అదనంగా మరో రూ. 500 కోట్లు మంజూరు చేశారు.
సామాన్యునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే ముందుండే చంద్రబాబునాయుడు పేదల గృహ నిర్మాణాల విషయంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నిర్మాణ పనులను నాలుగు దశల్లో జియో ట్యాగింగ్ చేయడం ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆన్ లైన్ ద్వారా సబ్సిడీల చెల్లింపులు జరుపుతున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ఇప్పటి వరకు లబ్ది పొందని నిజమైన పేదల సొంతింటి కల నిజమవుతోంది. క్షేత్రస్థాయిలో ఏర్పడే సమస్యలను ప్రజా పరిష్కార వేదిక 1100 కు ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. ఒకే స్థలంలో కుటుంబీకులిద్దరూ ఇళ్లు నిర్మించుకునే విధంగా ఉమ్మడి గోడల నిర్మాణానికి జివో నెంబర్ 94నూ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసింది. సొంతింటి కలను నిజం చేసుకున్న పేదలకు పక్కా ఇళ్లతో సమాజంలో గౌరవంతో పాటు వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. సొంతిల్లనేది సమాజంలో ఒక ప్రధాన గుర్తింపు కావడంతో పేదలకు ఆస్తి విలువ పెరగడంతో పాటు ఆ కుటుంబాల్లోని వృద్ధులకూ గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి.