కాంగ్రెస్ ఆకర్ష్.. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యపడుతుందా?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికల ద్వారా దూకుడు చూపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం ఫలించే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా? ఆత్మ స్థైర్యంతో కొట్లాడే స్కెచ్ వేస్తోందా?

how cm revanth reddy plan to merge brs legislative party in congress
Telangana Politics: అంకెలు తారుమారు చేయాలన్న వ్యూహం ఒకరిది.. అంకె తగ్గినా గుర్తింపు ఉండాల్సిందేనన్న పంతం మరొకరిది. ఆకర్ష్.. ఆకర్ష్ అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెంట పడే పార్టీ ఒకటి. ఆకర్ష్‌కు వికర్ష్ కనిపెట్టే పనిలో తంటాలు పడుతున్న పార్టీ మరొకటి. మొత్తానికి తెలంగాణ రాజకీయం భలే రసవత్తరంగా మారింది. ప్రతిపక్షమే లేకుండా పూర్తి ఏకపక్ష రాజకీయం ప్రదర్శించాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ కలలు నెరవేరుతాయా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికల ద్వారా దూకుడు చూపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం ఫలించే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా? ఆత్మ స్థైర్యంతో కొట్లాడే స్కెచ్ వేస్తోందా? తాజా రాజకీయ రచ్చ ఏంటి?
సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్
తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. బిఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్ లో బిఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని గట్టి కసరత్తు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఆ దిశగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. ఇంతకీ అసెంబ్లీ, మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యపడుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా రెండు సభల్లోనూ బీఆర్ఎస్ సభా పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడంపై ఫోకస్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఐతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నదే చర్చకు దారితీస్తోంది.
ప్రొవిజన్స్‌ను అనుకూలంగా మార్చుకొని..
ఏదైనా పార్టీ సభాపక్షాన్ని విలీనం చేసుకోవాలంటే మూడింట రెండొంతుల బలం ఉండాలి. అదే ప్రతిపక్ష హోదా తీసేయడానికి మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం ఆ పార్టీకి లేకుండా చేయాలి. అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 38 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 26 మంది పార్టీని వీడితే శాసనసభాపక్షం విలీనం అయినట్లు ప్రకటించొచ్చు. అదేవిధంగా 119 స్థానాల అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి కనీసం 12 మంది సభ్యులు ఉండాలి. 12 మంది కన్నా తక్కువ ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఐతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్లాన్స్ గమనిస్తే బిఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా ఏకంగా ఆ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని చూస్తోంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం శాసనసభాపక్షం విలీనం కావాలంటే మూడింట రెండొంతుల సభ్యులు మారాల్సిఉంది. గతంలో 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు బిఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేసుకోవాలని చూస్తోంది. చట్టంలో ఉన్న ప్రొవిజన్స్‌ను అనుకూలంగా మార్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని ఆలోచనలతో అడుగులు వేస్తోంది.
కేసీఆర్‌కు చెక్
ఒక పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు ఇతర పార్టీలోకి వెళ్తే.. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫిరాయింపుల చట్టం కింద పదవి కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఒక పార్టీ శాసనసభాపక్షం విలీనమైతే ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే చట్టం ఆసరాగా చేసుకుని 12 మంది బిఆర్ఎస్‌లో చేరి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేశారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీఎం రేవంత్ రెడ్డి ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌కు చెక్ చెప్పాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే ఇంకా 20 మంది చేరాల్సివుంటుంది. అంతమంది కాంగ్రెస్‌లో చేరతారా? లేదా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
గవర్నర్ కోటాలో రెండు ఖాళీలు
ఇక మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 38 మందే ఉన్నారు. గవర్నర్ కోటాలో రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ రెండూ ప్రభుత్వం సిఫార్సు చేసిన వారికే దక్కే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయంగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న 38 మందిలో 29 మంది సభ్యులు బీఆర్ఎస్ వారే.. మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావాలంటే ఆరుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను తీసేసినా మిగిలిన 25 మంది బిఆర్ ఎస్ ఎమ్మెల్సీల్లో కనీసం 17 మంది కాంగ్రెస్లో చేరాల్సిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మారారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా బస్వరాజు సారయ్య, ఎగ్గె మల్లేశం, బొగ్గవరపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, దండే విఠల్ కాంగ్రెస్‌లో గూటికి చేరారు. మండలిలో బిఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కావాలంటే ఇంకా 9 మంది ఎమ్మెల్సీలు చేరాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ లక్ష్యం అదే..
ప్రస్తుతానికి మండలిలో కాంగ్రెస్‌కు అధికారికంగా నలుగురు సభ్యులు ఉండగా, కొత్తగా చేరిన ఎమ్మెల్సీలతో ఆ సంఖ్య 12కి చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇద్దరు ఎంఐఎం సభ్యులు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నారు. ఇక గవర్నర్ కోటా వచ్చే ఇద్దరుతో కలిపితే మండలిలో కాంగ్రెస్ బలం 18కి చేరుతుంది. మండలిలో బిల్లులు పాస్ కావాలంటే కాంగ్రెస్‌కు ఇంకా ముగ్గురు ఎమ్మెల్సీలు అవసరమవుతారు. భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలతో ఈ బలం సంపాదించుకోవచ్చు. కానీ, కాంగ్రెస్ లక్ష్యం మాత్రం బీఆర్ఎస్ సభాపక్షాన్ని విలీనం చేసుకోవడమే అన్నట్లు కదులుతోంది.
Also Read : తెలంగాణ రాజకీయాలపై ఏపీ ఎఫెక్ట్.. అధికారం తారుమారైతే ఎవరికైనా ఇదే గతా?
పునరాలోచనలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యూహాన్ని నిలువరించేందుకు బీఆర్ఎస్ కూడా ప్రతివ్యూహాలను రచిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పార్టీని వీడినా, సభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ వీడుతారని అనుమానం ఉన్న వారిని మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా, అధినేతతోపాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడటంతో వారు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
Also Read : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే
కేసీఆర్‌తో సమావేశానికి ఆరుగురు డుమ్మా
మరోవైపు శుక్రవారం ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ నిర్వహించగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. వీరు ఏ కారణం చేత కేసీఆర్‌తో సమావేశానికి హాజరుకాలేదో అన్న విషయాన్ని ఆరా తీస్తోంది పార్టీ. గైర్హాజరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా? లేక వ్యక్తిగత కారణాల వల్లో.. సమయం లేక రాలేకపోయారా? అన్నది తేలాల్సివుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాజకీయం వాడివేడిగా కొనసాగుతుండంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గులాబీ పార్టీని వెంటాడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో వలసలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యతిరేకించగా, ఆయనను పార్టీ పెద్దలు సముదాయించారు. ఇక తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. మొత్తానికి వలస రాజకీయం ఇరుపార్టీల్లోనూ హీట్ పుట్టిస్తోంది.