INDIA: విపక్ష కూటమిలో అప్పుడే లుకలుకలు.. బెంగళూరులో నితీశ్‮‭ను అవమానిస్తూ పోస్టర్లు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బిహార్ నేతలు

కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది

INDIA: విపక్ష కూటమిలో అప్పుడే లుకలుకలు.. బెంగళూరులో నితీశ్‮‭ను అవమానిస్తూ పోస్టర్లు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బిహార్ నేతలు

Updated On : July 19, 2023 / 4:21 PM IST

Opposition Meet: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 26 పార్టీలతో మెగా కూటమి ఏర్పడింది. బెంగళూరు వేదికగా సమావేశమైన విపక్షాలు.. ఆ కూటమికి ఇండియా (I-N-D-I-A) అని పేరు పెట్టాయి. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నోవ్యవప్రయాల అనంతరం ఏర్పడిన ఈ కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు కనిపిస్తోంది. బెంగళూరులో చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో నితీశ్ కుమార్ పాల్గొనకుండానే పాట్నాకు వచ్చేశారు. దీంతో విపక్ష పార్టీల చర్చల్లో నితీశ్ కలత చెందారనే పుకార్లు జోరందుకున్నాయి.

Eatala Rajender: కేసీఆర్‌కి అటు ఎన్డీఏలో, ఇటు ఇండియాలో చోటు దక్కలేదు.. అందుకే ఇలా చేయొద్దు: ఈటల

వాస్తవానికి విపక్షాల ఐక్యం కోసం ముందు నుంచి నితీశ్ కుమార్ చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటి నితీశ్ కుమారే సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొనకపోవడం వల్ల సహజంగానే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి కూటమి పేరు ఇండియా అని పెట్టడం ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ కూటమికి పేట్రియాట్రిక్ డెమొక్రటిక్ అలయన్స్ (పీడీఏ) అని పెడతారని పాట్నా సమావేశాల అనంతరం ప్రచారం జరిగింది. కానీ రెండవసారి బెంగళూరులో జరిగిన సమావేశాల్లో ఇండియా అని పేరు మార్చారు.

అంతే కాకుండా.. త్రివర్ణం వచ్చేలా రంగులు అద్దారు. ఇది కాంగ్రెస్ పార్టీ జెండాను సూచించేలా ఉంటుంది. ఇత్యాది అంశాలు కూడా నితీశ్ అలకకు కారణం అయ్యుండొచ్చని అంటున్నారు. అందుకే.. అందరికి కంటే ముందే బెంగళూరును వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఈ పుకార్లను నితీశ్ పార్టీ అయిన జనతాదళ్ యూనైటెడ్ చీఫ్ రాజీవ్ రంజన్ (లాలన్ సింగ్) తిప్పికొట్టారు. నితీష్ కుమార్ గురించి భారతీయ జనతా పార్టీ పుకార్లు వ్యాపిస్తోందని ఆయన అన్నారు.

Srinivasa Rao : ఎన్డీఏ భేటీకి ఎందుకెళ్లారు.. ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి : సీపీఎం నేత శ్రీనివాసరావు

ఈ విషయమై లాలన్ సింగ్ మాట్లాడుతూ ‘‘నరేంద్ర మోదీకి రోజులు దగ్గర పడ్డాయన్నది వాస్తవం. ముంబయిలో కన్వీనర్ పేరును ప్రకటించనున్నారు. బెంగుళూరులో కన్వీనర్‌పై ఎటువంటి చర్చ జరగలేదు” అని నితీష్ కుమార్ విషయమై జరుగుతున్న ప్రచారానికి జేడీయూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మంగళవారం బెంగళూరులో జరిగిన మెగా సమావేశంలో 26 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేతలు ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్‭ని ఎదుర్కోవడానికి తమ కూటమికి ఇండియా I-N-D-I-A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) అని నామకరణం చేశాయి.

కూటమికి ఇండియా అనే పేరు ఉత్తమమైనదని నితీశ్ భావించడం లేదట. దీనికి ఆయన కొన్ని ప్రత్యమ్నాయాలను సైతం సూచించారట. అయితే ఆయన సూచనలకు సమావేశంలో అంతగా మద్దతు రాలేదు. దీంతో అలకబూనిన నితీశ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకాకుండానే రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ యాదవ్, అతని కుమారుడు తేజస్వి యాదవ్‌తో కలిసి పాట్నాకు తిరిగి వెళ్లారు. మంగళవారం సాయంత్రం వారు పాట్నా చేరుకోగానే మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.

Bangladesh woman Love Indian Man : మొన్న పాకిస్థాన్ మహిళ, ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళ.. భారత్ యువకులతో విదేశీ వనితల ప్రేమ- పెళ్లి!

అయితే నితీష్ కుమార్ ముందస్తుగా తిరిగి రావడానికి గల కారణాలను లాలన్ సింగ్ వివరించలేదు. కానీ ప్రయత్నాలు ప్రారంభించడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. “విపక్షాలను ఏకం చేయడానికి కసరత్తు ప్రారంభించిన వ్యక్తి చిన్న విషయాలకు కలత చెందడు” అని విపక్షాల సమావేశం కోసం బెంగళూరుకు కూడా వెళ్లిన సింగ్ అన్నారు. నితీష్ కుమార్ విలేకరుల సమావేశానికి గైర్హాజరు కావడంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి అంతకు ముందే చెప్పారు.

పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు. అయితే రెండవ సమావేశంలో కీలకంగా ఉన్నారు. నితీశ్ విషయంలో కూడా అలాగే జరిగిందని కొందరు వెనకేసుకొస్తున్నారు. అయితే నితీశ్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, తేజశ్వీ యాదవ్ కూడా వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొదట నితీశ్ ను ప్రధాని అభ్యర్థిగా జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ప్రచారం చేశాయి. అయితే కొద్ది రోజులకు ఆ ప్రచారాన్ని ఆపాయి. అయితే విపక్షాల సమావేశం నేపథ్యంలో కూటమికి కనీసం కన్వీనర్ అయినా అవుతారని అనుకున్నారు. కానీ ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ అలకకు అసలు కారణం ఇదేనని విమర్శకులు అంటున్నారు.

Telangana Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

నితీశ్ కుమార్ ప్రారంభించిన ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తోందని సుశీల్ కుమార్ మోదీ ఎద్దేవా చేశారు. “మొదట ప్రధానమంత్రి అభ్యర్థిత్వం పోయింది. కనీసం ఆయన కన్వీనర్‌గా అయినా ఉండాలని ఆశపడ్డారు. కానీ అది కూడా జరగలేదు. ఇక కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది” అని సుశీల్ మోదీ అన్నారు.

రెండవ విపక్ష సమావేశానికి ముందు బెంగళూరులో నితీష్ కుమార్‌ను ‘అస్థిర ప్రధాని పోటీదారు’గా అభివర్ణిస్తూ పోస్టర్లు వెలిశాయని, గంగా నది మీద వంతెన కూలిపోవడాన్ని అందులో హైలైట్ చేశారని బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి అన్నారు. ఇది బహుశా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేత తయారు చేయబడిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ చంద్ర మిశ్రా చౌదరి తోసిపుచ్చారు. తమ కూటమిలో చీలికలు సృష్టించడానికి బీజేపీ చేసిన ప్రయత్నమని ప్రేమ్ చంద్ విమర్శలు గుప్పించారు.