మేం అధికారంలోకి వస్తే.. గృహిణుల ఇంటిపనికి వేతనం ఇస్తాం : కమల్

Kamal Hassan Governance and Economic Agenda : ప్రముఖ విలక్షణ నటుడు, మక్కల్ నీది మయం (MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తన పార్టీ ప్రతిష్టాత్మక ఏడు పాయింట్ల పాలన, ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. సినిమా నటుడుగానే కాకుండా రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్లి మమేకం అవుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తారో, ఏయే పనులు చేస్తారో విన్నవిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు కమల్ సన్నద్ధమవుతున్నారు. ఎంఎన్‌ఎం మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు.
ప్రభుత్వ నిర్వహణ ఆర్థిక ఎజెండా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏడు అంశాల్ని పొందుపరిచారు. తమిళ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లో వచ్చానని ఆయన ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమేమి చేయనున్నారో ఆయన ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఏ రాజకీయ పార్టీ, నాయకుడు చేయని విధంగా వినూత్న ఆలోచనలతో కమల్‌హాసన్ ముందుకు దూసుకెళ్తున్నారు.
కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ, మహిళలను మాత్రం తప్పక ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా గ్రీన్ ఛానల్ ప్రభుత్వాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు. పౌరులు ఎక్కడికి వెళ్లకుండానే దరఖాస్తు చేసుకునేలా ఆన్ లైన్ హోంలను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఇంటికి కంప్యూటర్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనున్నట్టు తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్ద నుంచే మహిళలు చేసే ఇంటి పనులను మానిటైజ్ చేసేలా యోచిస్తున్నట్లు పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది. తిరువణ్ణామలై జిల్లాలో మంగళవారం కమల్‌హాసన్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. అలా అని ఆయన వెనక్కి వెళ్లలేదు. నాలుగు ఐదు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలతో కమల్ సమావేశమయ్యారు.