నవంబర్ రెండో వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, సిద్ధంగా ఉండాలని నేతలకు కేటీఆర్ ఆదేశం

minister ktr on ghmc elections: నవంబర్ రెండో వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్న మంత్రి… గ్రేటర్‌లో అభివృద్ధికి 60వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు.
నిత్యం గల్లీ గల్లీ తిరుగుతూ.. ప్రజల మధ్య ఉండాలని ఎమ్మల్యేలు, కార్పొరేటర్లకు దిశానిర్ధేశం చేశారు. గ్రేటర్‌లో పది హేనుమంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదన్న ఆయన… కార్పొరేటర్లకు ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలన్నారు.
బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు:
ఈసారి కరోనాతో పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల సేకరణలో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తవుతుంది. ఈలోగా కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు కమిషనర్ ఏర్పాట్లు మొదలుపెట్టారు.
గతంలో 1200మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేయగా, ఈసారి కరోనా నేపథ్యంలో 800మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్య 10వేలకు చేరుతుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌తోపాటూ… ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ… జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చుతున్నామంటూ… టీఆర్ఎస్… ఓటర్ల మెప్పు పొందేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. గత GHMC ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయం సాధించిన టీఆర్ఎస్… ఇప్పుడూ అదే ఆశిస్తోంది.
ఎన్నికలు నిర్వహించడం ఎలా?
అయితే ఎన్నికలు ఎలా జరిపించాలనే అంశం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సవాల్ గా మారింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలా లేక… ఈవీఎం (EVM)ల ద్వారా జరపాలా అన్నది ఎటూ తేల్చుకోలేకపోయింది. దీనిపై ఈమధ్యే కొన్ని శాఖల అధికారులతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించారు.
టీ-పోల్ ద్వారా పార్టీ అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు:
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులతో సమావేశం అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాన్ని ఆన్ లైన్ లో పొందుపరుస్తామని వెల్లడించారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లో నిర్వహిస్తామన్నారు. టీ-పోల్ ద్వారా పార్టీ అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. టీ పోల్ సాఫ్ట్ వేర్ తో పాటు సాంకేతిక అంశాలపై అక్టోబర్ 23 నుంచి 29 వరకు జోన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.