Opposition Meet-Live : జూలై 10 లేదా 12న మళ్లీ విపక్షాల సమావేశం..
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.

Opposition Meet: బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. తదుపరి సమావేశం జూలై 10 లేదా 12న హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణ
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బీజేపీ దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శిమ్లాలో తదుపరి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణ తయారు చేస్తున్నట్లు తెలిపారు.
-
మళ్లీ జూలై 10 లేదా 12న..
విపక్షాల మెగా సమావేశం ముగిసింది. తదుపరి సమావేశం జూలై 10 లేదా 12న హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
-
అందుకే ఆ పార్టీలకు దూరంగా ఉన్నాం..
బీజేపీ, కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం చేశాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కారణం వల్లే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర భారత్ లో అత్యంత బలహీనమైన ప్రధాన మంత్రి మోదీయేనని విమర్శించారు. తాము హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే ఆర్డినెన్సును తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాల రాస్తే, పోరాటం తప్పదని కేటీఆర్ అన్నారు.
-
మమతా బెనర్జీ అభ్యంతరాలు
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ తీరుపై సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని లేవనెత్తడం గమనార్హం. బెంగాల్లో ఆ పార్టీ తీరును మార్చుకోవాలని చెప్పారు. సహృదయంతో పార్టీలు మెలగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. విపక్షాలు గొడవలు పడితే బీజేపీ లబ్ధిపొందుతుందని అన్నారు.
-
కుటుంబ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి.. ఫడ్నవీస్ విమర్శలు
విపక్షాల మెగా సమావేశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. నేటి సమావేశంలో ఉన్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలని, తమ కుటుంబాలను కాపాడుకునేందుకే ఒక్కచోట చేరి కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నమే జరిగినప్పటికీ అది ఫెయిల్ అయిందని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.
-
విపక్షాల ఐక్యత కాదు ముఖ్యం.. విపక్షాల సమావేశంపై కేటీఆర్
బిహార్ రాజధాని పాట్నాలో మెగా ప్రతిపక్ష సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. విపక్షాల ఐక్యత కంటే ముఖ్యమైన సమస్యలు ఈ దేశంలో చాలా ఉన్నాయని, ముందు వాటిపై శ్రద్ధ పెట్టాలని చురక అంటించారు. దేశంలోని సమస్యలన్నింటికీ కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యత అన్న కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
-
మెగా ప్రతిపక్షాల సమావేశంలో నితీష్ కుమార్, రాహుల్ గాంధీ మొదటి స్పందన
పాట్నాలో మెగా ప్రతిపక్ష సమావేశం ప్రారంభంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఐక్యత సందేశాన్ని ఇచ్చారు. వివిధ ప్రతిపక్ష నేతలకు స్వాగతం పలుకుతూ మాట్లాడిన నితీష్ కుమార్.. ‘మనం కలిసి రావడం చాలా ముఖ్యం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కలిసి రావాలి’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విపక్షాల ఐక్యతను నొక్కి చెప్పారు. "ప్రతిపక్ష నాయకులు స్వచ్ఛమైన, స్పష్టమైన హృదయంతో ఏకం కావాలి. ప్రతిదీ ముఖాముఖిగా క్రమబద్ధీకరించబడాలి" అని అన్నారు.
-
విపక్షాల మెగా సమావేశంలో పాల్గొన్న నేతలు వీరే
1. నితీష్ కుమార్ (JDU)
2. మమతా బెనర్జీ (AITC)
3. MK స్టాలిన్ (DMK)
4. మల్లికార్జున్ ఖర్గే (INC)
5. రాహుల్ గాంధీ (INC)
6. అరవింద్ కేజ్రీవాల్ (AAP)
7. హేమంత్ సోరెన్ (JMM)
8. ఉద్ధవ్ థాకరే (SS-UBT)
9. శరద్ పవార్ (NCP)
10. లాలూ ప్రసాద్ యాదవ్ (RJD)
11. భగవంత్ మాన్ (AAP)
12. అఖిలేష్ యాదవ్ (SP)
13. KC వేణుగోపాల్ (INC)
14. సుప్రియా సూలే (NCP)
15. మనోజ్ ఝా (RJD)
16. ఫిర్హాద్ హకీమ్ (AITC)
17. ప్రఫుల్ పటేల్ (NCP)
18. రాఘవ్ చద్దా (AAP)
19. సంజయ్ సింగ్ (AAP)
20. సంజయ్ రౌత్ (SS-UBT)
21. లాలన్ సింగ్ (JDU)
22. సంజయ్ ఝా (RJD)
23. సీతారాం ఏచూరి (CPIM)
24. ఒమర్ అబ్దుల్లా (NC)
25. టీఆర్ బాలు (DMK)
26. మెహబూబా ముఫ్తీ (PDP)
27. దీపాంకర్ భట్టాచార్య (CPIML)
28. తేజస్వి యాదవ్ (RJD)
24 అభిషేక్ బెనర్జీ (AITC)
25. డెరెక్ ఓ'బ్రియన్ (AITC)
26. ఆదిత్య థాకరే (SS-UBT)
27. డి రాజా (CPI)
-
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒంటరిగా ఓడించలేమని బహిరంగంగా ఒప్పుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. శుక్రవారం బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన విపక్షాల మెగా సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీని తాము ఒంటరిగా ఓడించలేమని, అందుకు ఇతరుల మద్దతు తమకు అవసరమని బహిరంగంగా ప్రకటించినందుకు కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని స్మృతి అన్నారు.
-
అది మనందరి బాధ్యత.. విపక్షాల సమావేశంపై ఖర్గే
రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మనందరి బాధ్యతని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన విపక్షాల మెగా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన తమ మీటింగ్ దేశానికి ఒక నూతన దిశానిర్దేశాన్ని ఇస్తుందని ఖర్గే అన్నారు.
संविधान और लोकतंत्र की रक्षा हमारा एकमात्र दायित्व है।
देश को एक नई दिशा देने के लिए हमारी बैठक। pic.twitter.com/BjvqvJigX9
— Mallikarjun Kharge (@kharge) June 23, 2023
-
అందరూ మాయావతిని కలవండి, ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. విపక్ష పార్టీల నేతలకు రాజ్‌భర్ సలహా
ఒకవైపు దేశంలోని 15 విపక్ష పార్టీల సమావేశం కొనసాగుతుండగా సుహేల్దేవ్ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ కీలక సూచన చేశారు. విపక్ష నేతలంతా కలిసి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయాతిని కలుసుకోవాలని, అనంతరం ఆమెను ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించాలని అన్నారు. ఇంతకు ముందు ఆయన ఇలాగే వ్యాఖ్యానించారు. విపక్షాల ఐక్యత కోసం దేశంలోని నేతలందరినీ కలుస్తున్నవారు మాయావతిని ఎందుకు కలవడం లేదని, వారికి నిజంగా బీజేపీని ఓడించాలనే సంకల్పం ఉంటే మాయావతిని ప్రధానిగా ప్రకటించాలని అన్నారు.
-
విపక్ష పార్టీలపై జనతాదళ్ ఆసక్తికర పోస్టర్
పాట్నాలో కొనసాగుతున్న విపక్ష పార్టీల మెగా సమావేశంపై నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది. విపక్ష పార్టీల కూటమి ‘పార్టీలది కాకుండా భారతీయుల హృదయాల మహాకూటమి’ అని పేర్కొంది. నితీశ్, లాలూ సహా ఈ సమావేశానికి హాజరైన నేతల ఫొటోలతో చేసిన ఈ పోస్టర్లో ‘దలోం కా నహీ, భారతీయ్ దిలోం కా మహాగఠ్‌బంధన్’ అని హిందీలో రాసుకొచ్చారు.
दलों का नहीं, भारतीय दिलों का महागठबंधन।#2024_में_भाजपा_मुक्त_देश#महागठबंधन#नीतीश_कुमार#vipakshiekta pic.twitter.com/dxkhzCIxdV
— Janata Dal (United) (@Jduonline) June 23, 2023
-
ఆప్ వింత ధోరణి.. లోపల దోస్తీ, బయట కుస్తీ
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై స్టాండ్ ఏంటో చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఒకపక్క విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా ఇతర ఆప్ నేతలు సమావేశమయ్యారు. ఇదే సమయంలో బయట ఆర్డినెన్సుపై కాంగ్రెస్ పార్టీపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ, భాజపా ఒప్పందం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని, కానీ వారు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
-
కౌన్ బనేగా పీఎం క్యాండిడేట్?
విపక్షాల మెగా సమావేశం సందర్భంగా విపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై చర్చ మొదలైంది. విపక్షాల నుంచి ప్రముఖంగా నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వీరి నలుగురిలో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ నెట్టింట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ విషయం ఈ సమావేశంలో తేలుతుందో లేదో చూడాలి మరి.
-
రాబోయే లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సహా దేశంలోని విపక్షాలన్నీ ఏకమై ఎన్నికలు వెళ్లాలనే లక్ష్యంతో తలపెట్టిన వివపక్షాల మెగా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశంలోని దాదాపు 15 పార్టీల నుంచి అగ్ర నేతలు పాల్గొన్నారు.
#WATCH | Opposition leaders' meeting to chalk out a joint strategy to take on BJP in next year's Lok Sabha elections, underway in Bihar's Patna
More than 15 opposition parties are attending the meeting. pic.twitter.com/d9qRfvOdVj
— ANI (@ANI) June 23, 2023