ప్లాస్టిక్ వాడకాన్ని మానేయండి : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త మున్సిపల్ చట్టాని రూపోందించామని, మెరుగైన పౌర సేవల అందిస్తూ పట్టణాలను, పల్లెలను అభివృధ్ది చేసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖమ్మం లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. 600 గజాల వరకు ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లోనే అనుమతి మంజూరు చేస్తాం. అనుమతుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఏప్రిల్ 2న టీఎస్ బీపాస్ పథకం ప్రారంభిస్తామని’ కేటీఆర్ వివరించారు.
‘అన్ని పట్టణాలకు ఆదర్శంగా ఖమ్మం పట్టణాన్నిమంత్రి పువ్వాడ అజయ్ అభివృద్ధి చేస్తున్నారని…. 13 రహదారుల విస్తరణ అజయ్ నేతృత్వంలో కొనసాగుతోందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ వాసులు అసూయపడేలా లకారం అభివృద్ధి చేశారు. గత అభివృద్ధి..ఇప్పటి అభివృద్ధిని ఒక్కసారి పరిశీలించాలి. అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ఒక్కటే. తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ చేపట్టాం.. పట్టణ ప్రగతి పౌరుల భాగస్వామ్యంతో విజయవంతం చేస్తున్నాం అని కేటీఆర్ చెప్పారు. మూడు నెలల్లో ఖమ్మం పట్టణంలో 400 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రతి డివిజన్‌లో హరితప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. నాటిన మొక్కల్లో 85శాతం బతకకపోతే కార్పొరేటర్ల పదవులు పోతాయని హెచ్చరించారు.
ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని…ఆహార పదార్ధాలు తెచ్చుకునేందుకు జ్యూట్ బ్యాగులు, కానీ స్టీల్ బాక్సులు కానీ వాడాలనిక్యారీ బ్యాగులు వాడకుండా చూడాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. కొత్త పార్కుల నిర్మాణం, ఉన్న పార్కులను అభివృద్ధి చేయాలి. వాటర్ ఆడిట్‌ను నిర్వహించాలి. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ప్రజుల వాడి పారేసిన క్యారీ బ్యాగులతో నాలాలు పూడుకు పోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందన్నారు. ప్రజలు వెంటనే తమ ఆలోచన మార్చుకుని నేటి నుంచే పారిశుధ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ను స్పూర్తిగా తీసుకుని ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు వచ్చి మీ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. మనం మారుదాం…మన నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అది మీ నుంచే మొదలెట్టమని ఆయన కోరారు.
ప్రజలు ఇష్టారీతిన చెత్తను పడేయడం మంచి పద్ధతికాదు. ఖమ్మంలోని మున్నేరువాగు వెంట రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఖమ్మం పట్టణం రూపురేఖలు మారేలా అభివృద్ధి జరుగుతోంది. సామూహికంగా కదిలితే పట్టణాలను బాగు చేసుకోవచ్చు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని’ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే ఏడాదిలోపు కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయని కార్పోరేటర్లు ప్రజల్లో అవేర్ నెస్ కల్పించి ఖమ్మం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది కూడా బాధ్యతగా వ్యవహరించి పట్టణాభివృధ్దికి సహకరించాలని అన్నారు.