టీపీసీసీ అధ్యక్ష ఎంపికపై సరికొత్త ట్విస్ట్..!

New Twist on TPCC chief selection : ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు. అలాంటి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఓ సీనియర్ పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. దీంతో అప్పటివరకు రేస్‌లో ప్రముఖంగా నిలిచిన నేతకు ఆ పదవి దక్కదనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ టీపీసీసీ కూర్పులో ఎలాంటి మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో అనూహ్య పరిణామాలు సంభవించాయి. టీపీసీసీ చీఫ్, కమిటీల నియామక ప్రక్రియలో ఆచితూచి అడుగులేస్తున్న హైకమాండ్… అసంతృప్తులకు తావులేకుండా చర్యలు తీసుకుంది.
రేపో మాపో టీపీసీసీ చీఫ్ పేరు ప్రకటించడం ఖాయం… రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ బాస్ అవుతారు అనుకున్న వేళ… సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును పరిశీలించింది. గతేడాది దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా ఇచ్చారు. దీంతో ఎంపిక అనివార్యమైంది. సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును గట్టిగానే పరిశీలించింది. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. అధికారిక ప్రకటన లాంఛనం డిసెంబర్ చివరవారంలోనే లీకులొచ్చేసరికి సీనియర్ నేతలు గుస్సా అయ్యారు.
నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అసంతృప్తి సెగ తగులుతుందని హెచ్చరించారు. చీఫ్‌ను అప్పుడే ప్రకటించవద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు అదే పనిగా విజ్ఞప్తి చేశారు. రేవంత్‌కు ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ కొంతమంది హైకమాండ్‌కు లేఖలు రాశారట. ఇంతలోనే హైదరాబాద్‌లో వి.హనుమంతరావు.. హైకమాండ్ తీరును తప్పుపట్టారు. పరిస్థితిని గమనించిన హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందట. మధ్యే మార్గంగా జీవన్‌రెడ్డి పేరును పరిశీలించిందట. 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేవంత్ వైపు మొగ్గుచూపినా చివరకు సీనియర్ల ఒత్తిడితో నిర్ణయాన్ని మార్చుకుందట కాంగ్రెస్ హైకమాండ్.
గత నెల 27నే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారట మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్. పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారట. ఇటు రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించేందుకే మొగ్గుచూపిందంటున్నారు హైకమాండ్. ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ అధిష్టానం పెద్దలకు స్పష్టం చేశారట. అంతే కాదు…ప్రచార కమిటీ ఛైర్మన్ పదవే తనకు ఇష్టమని స్పష్టం చేశారట. దీంతో… రేవంత్ కోరుకున్న పదవిని ఆయనకు ఇచ్చేందుకు సిద్దపడిందట హైకమాండ్. రేస్‌లో ఉన్న సీనియర్లకు కాకపోయినా.. వివాదారహితుడు, సౌమ్యుడుగా పేరుగాంచిన జీవన్‌రెడ్డికి ఇస్తే ఎలాంటి తలనొప్పులు, అసంతృప్తులు ఉండవని భావించిందట అధిష్టానం.
జీవన్‌రెడ్డికి ఉన్న సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని హైకమాండ్ పరిగణనలోకి తీసుకుందట. 1981లో రాజకీయ ఆరంగేట్రం చేసి మాల్యాల జనసమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్‌రెడ్డి..ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ, కాంగ్రెస్ కేబినెట్‌లలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్‌రెడ్డి…కాంగ్రెస్ క్యాడర్‌లో సరికొత్త జోష్ తెచ్చేందుకు ఏం చేయాలో అది చేస్తానంటున్నారు. చూద్దం మరి.. హైకమాండ్ మంత్రాంగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.