Opposition Meet: బెంగళూరు విపక్షాల సమావేశంపై ప్రభావం చూపిన ఎన్సీపీ రాజకీయ సంక్షోభం
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల ప్రధాన నాయకులు పాల్గొన్నారు.

Opposition meet
Opposition Meet: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం విపక్షాల సమావేశంపై ప్రభావం చూపింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బెంగళూరులో ఈ నెల 12, 13 తేదీల్లో జరగాల్సిన విపక్షాల మెగా సమావేశం వాయిదా పడింది. గత నెల 23వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో తొలిసారి విపక్షాల సమావేశం జరిగింది. అయితే ఈసారి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. తొలుత హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ.. తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరును ఎంపిక చేసుకున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపథ్యంలో ఈసారి భేటీకి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ తెలిపింది. తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల ప్రధాన నాయకులు పాల్గొన్నారు.
ఇక విపక్షాల రెండవ మెగా సమావేశం జూలై 17, 18న ఉంటుందని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. అయితే సమావేశ స్థలం మార్చలేదు. ముందుగా నిర్ణయించినట్టే బెంగళూరులో జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘పాట్నాలో భారీ విజయవంతమైన అఖిల-ప్రతిపక్ష సమావేశం అనంతరం.. రెండవ సమావేశాన్ని 2023 జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో నిర్వహిస్తాము’’ అని వేణుగోపాల్ ట్వీట్ చేశారు.