ఆయన సీటు.. ఆయన ఇష్టం : పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు ఏదీ!

  • Published By: madhu ,Published On : February 18, 2019 / 01:41 PM IST
ఆయన సీటు.. ఆయన ఇష్టం : పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు ఏదీ!

Updated On : February 18, 2019 / 1:41 PM IST

ఏపీ రాజకీయాల్లో పక్కా ప్రభావితం చూపిస్తానని…ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా సీఎం అవుతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. గతంలో అనంతపురం అన్నారు.. తర్వాత ఏలూరు.. ఇటీవలే పిఠాపురం అంటున్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? అనే ప్రశ్న అభిమానుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఏపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఏలూరు నియోజకవర్గంలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పోటీ కన్ఫామ్ అనే ప్రచారం జరిగింది. తూర్పుగోదావరి నియోజకవర్గంలోని ఏదో ఒక స్థానం ఎంచుకోనున్నట్లు పవన్ ప్రకటించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. లేటెస్ట్‌గా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారనే ప్రచారం రావటంతో.. అందరూ అయోమయంలో పడ్డారు.

పార్టీ త‌రపున స్క్రీనింగ్ క‌మిటీని నియమించిన ప‌వ‌న్.. అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. మొద‌టి ద‌రఖాస్తును పవన్ సమర్పించారు. రెండు నియోజ‌క‌ర్గాల నుంచే కాకుండా.. కేవ‌లం ఒక్క నియోజ‌క‌ర్గంలోనే బరిలోకి దిగాలని నిర్ణయించారంట. ఆ నియోజకవర్గం ఏంటీ అనేది మాత్రం వెల్లడించలేదు. పవన్ కల్యాణ్ మనసులో ఏముందీ.. ఏ జిల్లా.. ఏ నియోజకవర్గం నుంచి పోటీకి దిగబోతున్నారనేది పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల్లోనూ క్లారిటీ లేకపోవటం విశేషం. ఎన్నికల సీజన్ వచ్చేసింది.. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్న క్రమంలో.. ఓ పార్టీ అధినేత పోటీ చేసే నియోజకవర్గమే ఫైనల్ కాకపోవటం జనసేన పార్టీ నేతల్లో గందరగోళానికి దారితీస్తోంది. 

ఉత్తరాంధ్రను ఎంచుకుంటే బాగుంటుందని పార్టీలోని కొందరు గట్టిగా కోరుతుంటే.. మరొకరు మాత్రం అనంతపురం ఎంచుకుంటే బాగుంటుదనే వాదన వినిపిస్తున్నారు. పోటీ చేయాల్సిన సీటుపై పవన్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మ‌రి జనసేనాని నిర్ణయం ఎంత వ‌ర‌కూ వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి…