పీఆర్పీ ఫీవర్ : ఎదురుదెబ్బలకు తట్టుకోవాలి – పవన్

జనసేన అధినేత పవన్‌కి ప్రజారాజ్యం ఫీవర్ ఇంకా పోలేదు.. పార్టీ పెట్టినప్పటి నుంచి అప్పటి అనుభవాలనే గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.. పార్టీ నిర్మాణంలో.. ఎన్నికల ప్రచారంలో.. ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అప్పటి ఎదురుదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్న పవన్.. అలాంటి వాటికి తట్టుకోవాలని పదే పదే చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజారాజ్యం అనుభవాలను గుర్తు చేస్తూనే ఉన్నారు పవన్. ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రజారాజ్యాన్ని ప్రస్తావించిన పవన్..ఆనాడు తగిలిన ఎదురుదెబ్బలను ఎన్నికలు తరవాత కూడా ప్రస్తావిస్తున్నారు.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులతో పవన్ కళ్యాణ్ విడతల వారీగా సమావేశాలు నిర్వహించారు. మే 12వ తేదీ ఆదివారం 50మంది అభ్యర్ధులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పోలింగ్ జరిగిన సరళి గెలుపు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో అనుభవాలు, ఫలితాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు పవన్. ఈ సమావేశంలో భవిష్యత్తులో పార్టీ తరపున నిర్వహించవలసిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిపేందుకు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యనాయకులకు సూచించారు.
ఇదిలా ఉంటే ఈ సమీక్షా సమావేశంలో పీఆర్పీ ప్రస్తావన తెచ్చారు. ప్రజారాజ్యం పార్టీపై ఉద్దేశ పూర్వకంగా కుట్రలు చేసిన వైనాన్ని నేతలకు పవన్ వివరించారు. తాను ముందు నుండి ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నానో వివరించారు. గత అనుభవాల నేపథ్యంలో పార్టీ నిర్మాణం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాల్లో అన్ని రకాలుగా ఆలోచించి అడుగులు వేశామన్నారు. పీఆర్పీ సమయంలో తగిలిన ఎదురుదెబ్బలు మళ్ళీ తగిలినా తట్టుకునేందుకు బలం ఉందన్నారు పవన్. అటువంటి ఎదురు దెబ్బల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని పవన్ నేతలకు వివరించారు.
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని సూచించారు పవన్. ఇలా పీఆర్పీ ఫీవర్ పవన్‌ని ఇంకా వెంటాడుతునట్టే కనిపిస్తోంది. అయితే కొన్ని రోజుల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో ఎదురుదెబ్బలకు తట్టుకోవాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఈ ఎన్నికల ఫలితాలు జనసేనకు ఎలాంటి అనుభవాలను చూపిస్తాయో చూడాలి.