పీసీసీ చీఫ్ పీఠంపై కన్నేసిన జగ్గన్న! 

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 11:52 AM IST
పీసీసీ చీఫ్ పీఠంపై కన్నేసిన జగ్గన్న! 

Updated On : December 18, 2019 / 11:52 AM IST

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కన్ను ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పీఠంపై పడిందట. ఈ పదవికి తాను ఎలా అర్హుడినో పార్టీ అధిష్టానానికి చెబుతూ.. తనని కాదంటే ఎవరిని పీసీసీ చీఫ్‌గా చేస్తే బాగుంటుందోనన్న ఉచిత సలహా కూడా అధిష్టానానికి ఇచ్చేశారంట. అయితే, నియోజకవర్గ ప్రజలు మాత్రం పార్టీ  పదవులు సరే.. ఉన్న ఎమ్మెల్యే పదవితో నియోజకవర్గానికి ఏమి చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడాయన సంగారెడ్డికి అతిథి ఎమ్మెల్యేగా మారిపోయారంటున్నారు. హైదరాబాద్‌లో మకాం పెట్టేసి.. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తుంటారు. గతంలో ఆయనెప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. అందుకే జిల్లాలో ఈ ఒక్క చోటనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. దీనికి కారణం జనాల్లో జగ్గారెడ్డికి ఉన్న ఆదరణే. కానీ, ఇప్పుడు అదే జనానికి దగ్గరగా ఉండడం లేదంటున్నారు. 

జగ్గారెడ్డి హామీలతో అయోమయంలో కేడర్ :
జగ్గారెడ్డి చేతిలో నాలుగు పైసలుంటే తప్ప సంగారెడ్డికి రారనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే చేతిలో నాలుగు పైసలుంటే తన కోసం వచ్చే వారికి పంచిపెట్టడం ఆయనకో తృప్తి. కానీ, ఈ మధ్య డబ్బులు లేక సంగారెడ్డికి రావడం తగ్గించేశారని అంటున్నారు. ఆ మధ్య దసరా ఉత్సవాల్లో వేదిక మీద నుంచి వంద కోట్ల అప్పు ఉందంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. మరోపక్క, సంగారెడ్డి వచ్చిన ప్రతిసారీ ఆయన ఇస్తున్న హామీలతో కేడర్ తలపట్టుకుంటోంది. కోట్లాది రూపాయిల హామీలు ఇచ్చి వాటిని నిలుపుకోకపోవడంతో జనాలకు సమాధానం చెప్పలేక పోతున్నామని పార్టీ కేడర్ అంటోంది. 

ఈ మధ్యనే ఓ ఉత్సవంలో రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేస్తానని జగ్గారెడ్డి చెప్పడంతో వామ్మో ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయని అంతా అనుకున్నారట. కానీ, తన దగ్గర పైసా లేదనే విషయాన్ని చావు కబురు చల్లగా చెప్పారంట. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ.. తన చేతిలో ఏమీ లేదని, ప్రభుత్వం సహకరించి నిధులిస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు.

తాను ఎవరినీ విమర్శించనని, మీరెవరూ విమర్శించొద్దు అని కేడర్‌కు చెబుతూనే విమర్శలు చేస్తుంటారట. ఆయన వ్యవహారశైలి అర్థం కాక అనుచరగణం అయోమయంలో ఉంది. అత్యవసరమై తనను కలవానుకుంటే మాత్రం కుదరని పని అని, ఏ ఏ అవసరాలకు ఎవర్ని కలవాలో దసరా నాడు వారి పేర్లను ప్రకటించారు. జనం వారి సమస్యల్ని ఆయా వ్యక్తులకు చెప్పుకుంటే వారు జగ్గారెడ్డికి చేరవేస్తారన్న మాట. అంతే తప్ప జగ్గారెడ్డిని నేరుగా కలుసుకునే అవకాశం ఉండదనే చెప్పాలి. 

జగ్గన్న పోకడతో.. కారెక్కిన కొందరు :
జగ్గారెడ్డి వ్యవహారశైలి అటు కేడర్‌కు, ఇటు జనాలకు తలనొప్పిగా మారింది. ఇక నియోజకవర్గంలో ఆయనిది వన్ మ్యాన్ షో. ఏ నాయకుడు తనను కాదని చిన్న కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. అంతెందుకు నియోజకవర్గంలో ఏ బ్యానర్, ఫ్లెక్సీ వెలిసినా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫొటోలు తప్ప వేరే వాళ్లవి ఒక్కటి ఉన్నా ఇక రచ్చ రచ్చే.

గత ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కేడర్ ఇప్పుడు జగ్గారెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటోందని అంటున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చక కంది మండల నాయకుడు రామకృష్ణారెడ్డి వెయ్యి మంది అనుచరులతో ఇటీవలే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 

ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరిందన్న చందంగా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి పార్టీ పదవుల కోసం వెంపర్లాడటంపై సొంత అనుచరులే పెదవి విరుస్తున్నారు. నిధులు, అభివృద్ధి సరే కనీసం గెలిపించిన జనానికైనా అందుబాటులో ఉండాలి కదా అన్న చర్చ అంతటా వినిపిస్తోంది. సపరివార సకుటుంబ సమేతంగా హైదరాబాద్‌కే పరిమితమైన జగ్గారెడ్డి.. పీసీసీ చీఫ్ అయితే గానీ సొంత నియోజకర్గానికి రారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.