బీజేపీతో కలిసి తప్పు చేశారా? పవన్ కళ్యాణ్‌ను రాజకీయాలకు దూరం చేసిందెవరు

పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు? ఒకవేళ ఎవరైనా దూరం చేసి ఉంటే.. దూరం చేసిందెవరు?
ఆ విషయంలో పవన్ ఫెయిల్:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగవుతోన్న తరుణంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అందరూ భావించారు. ఈ లోటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. బీజేపీ కూడా రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అవకాశాలు ఎక్కువే. కానీ, పార్టీని నడపడం అన్నా.. అధికారంలోకి రావాలన్నా.. ఓపిక, సహనం చాలా అవసరం. వాటితో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉండాలి. ఈ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ విఫలం అయ్యారనే అంటున్నారు జనాలు.
పార్టీని బీజేపీకి అప్పగించేసి సినిమాల్లో బిజీ అయిన పవన్:
గడచిన దశాబ్ద కాలంతో పోల్చితే ఇపుడు మూడో ప్రత్యామ్నాయానికి మంచి అవకాశం ఉందని జనాలు అంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేడర్‌ను బలోపేతం చేసుకోవలసిన పవన్ కల్యాణ్.. తన పార్టీని పొత్తులో భాగంగా బీజేపీకి అప్పగించేసి, తాను సినిమా షూటింగుల్లో బిజీ అవ్వడంతో పార్టీని నమ్ముకున్న కేడర్ దూరం అవుతోందట. రాష్ట్రంలోని చాలామంది జనసేనపై పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకున్నారు. మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే వామపక్షాలు సైతం పవన్‌ని నమ్ముకొని నడిచాయి. అయినా ఫలితం లేకపోయింది.
2014-19 మధ్యకాలంలో జనసేన బలోపేతానికి చర్యలేవీ?
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొదటి ఎన్నికల సమయంలో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. పవన్ పనిచేయడంతో ఆ కూటమికి కొంత మేరకు ప్లస్ అయ్యింది. అధికారంలోకి వచ్చేస్తామని భావించిన వైసీపీకి దెబ్బతిన్నది. ఆ తర్వాత కొంత కాలానికి జనసేన కూడా టీడీపీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. అయితే 2014 నుంచి 2019 మధ్యకాలంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పవన్ అనుకున్న విధంగా వ్యూహాలు రచించ లేకపోయారు.
ప్రత్యామ్నాయం అనుకుంటే ప్రశ్నార్థకం:
రాజకీయాలంటే పార్ట్ టైం కాదనే విషయం పవన్‌కు ఇంకా తెలియడం లేదంటున్నారు. వపన్ ఎక్కడకు వెళ్లినా తరలివచ్చే జనాన్ని చూసి అందరూ ఓట్లు వేస్తారనే భావించారు. కానీ, 2019 ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించడానికి ఆ జనం సిద్ధపడలేదు. 2019 ఎన్నికల్లో పొత్తులు కలిసి రాలేదు. ప్లానింగ్ సరిగా లేకపోవడంతో అన్నింటా విఫలమయ్యారు. ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందని భావించిన పార్టీ.. ఇప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి.
ఏ కార్యక్రమం చేపట్టినా ఒకటి రెండు రోజుల హడావుడే:
గత ఎన్నికల్లో పోటీ చేసినా అనుభవరాహిత్యం స్పష్టమైంది. ఆర్థికపరమైన అంశాల్లోనూ ఎలాంటి ప్లానింగ్ లేదని అర్థమైంది. అందుకే పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందనే టాక్ ఉంది. కేడర్ పరంగా బలపడాల్సింది పోయి.. నానాటికి తగ్గిపోతోంది. సినీ గ్లామర్ తప్ప.. రాజకీయ గ్లామర్‌కు పవన్ అలవాటు పడలేకపోయారని అంటున్నారు. ఏవైనా కార్యక్రమాలు చేపట్టినా ఒకట్రెండు రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం లాంటి చర్యలతో ప్రజల్లో కూడా నమ్మకం తగ్గిపోతోంది.
బీజేపీతో కలవడం వల్ల ఇమేజ్ దెబ్బతినిందా?
పరిస్థితులు గమనించిన తర్వాత మరో నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నడపడం అంటే ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితే అని పవన్ భావించారట. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారట. ఒంటరిగా ఎదగాల్సిన జనసేన.. ఇప్పుడు బీజేపీతో కలవడంతో పార్టీకి ఉన్న ఇమేజ్ కొంత దెబ్బతింది. ఇపుడు జనసేన ఒంటరిగా ఎలాంటి కార్యక్రమం చేయలేని పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో కలిసిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలేవీ లేవు. పవన్ సినిమాల్లో బిజీ అయ్యారు. పార్టీలో ఉన్న ఒకరిద్దరు అడపా దడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఇలాగే సాగేలా ఉన్నాయి. అంది వచ్చిన అవకాశాలను జనసేనాని చేజేతులా జారవిడుచుకున్నారని జనాలు అంటున్నారు.