SPY రెడ్డి : బీజేపీతో మొదలై జనసేనతో ముగిసింది

నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎస్పీవై రెడ్డి మృతితో ఆయన కుటుంబీకులు, అభిమానులు శోఖసంద్రంలో మునిగిపోయారు.
రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయవచ్చన్న ఉద్దేశంతో.. బీజేపీ తరపున 1991 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఎస్పీవై రెడ్డి… మున్సిపల్ ఛైర్మన్‌గా రికార్డ్ మెజారిటీ సాధించారు. 2004లో నంద్యాల నుండి MP అభ్యర్థిగా పోటీ చేసి లక్ష మెజారిటీ సాధించిన ఆయన… 2009లో మరోసారి ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు.
ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేక మంది అభిమానులను, అనుచరులను సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ రూపాయికే పప్పు రొట్టె అందించిన రెడ్డిగా పిలుచుకుంటారు. ఎస్పీవై రెడ్డి మృతితో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి ఇకలేరనే విషయం తెలిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ, కార్యకర్తల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.