అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు కీలక భేటీ.. పొత్తులు, సీట్లపై చర్చ..!
పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Chandrababu With Amit Shah
Amit Shah Chandrababu Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో వీరంతా సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపై అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తుతో కలిగే లాభాలు ఏంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి..
పొత్తుల అంశంతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఓటర్ల జాబితాలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, విపక్ష నేతలపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. గత ఏడాది జూలై 3న అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయిన విషయం విదితమే.
ఢిల్లీలో అమిత్ షా నివాసంలో దాదాపు గంటసేపు వీరి భేటీ కొనసాగింది. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం చంద్రబాబు, నడ్డా.. అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు.
Also Read : సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు
బీజేపీ హైకమాండ్ తో చర్చ తర్వాత చంద్రబాబు మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాలు ఆశిస్తున్నట్లు సమాచారం. 6 నుంచి 7 ఎంపీ స్థానాలు కూడా బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీకి, 10లోపు అసెంబ్లీ, 3 నుంచి 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో గెలిచిన విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, కైకలూరు అసెంబ్లీ స్థానాలు సహా మరో ఆరు స్థానాలు బీజేపీ కోరుతోందని సమాచారం. అరకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది.
బీజేపీ-జనసేన పార్టీలు రెండింటికీ కలిపి 30 అసెంబ్లీ 5 లేదా 6 ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు పర్యటన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లే ముందు ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమిత్ షా తో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామని నేతలతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.