దుగ్గిరాలలో హైటెన్షన్ : చింతమనేని అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
సెప్టెంబర్ 11, బుధవారం ఆయన బెయిల్ పిటీషన్ హై కోర్టులో విచారణకు రానుంది. తప్పు చేశారు కాబట్టే దాక్కున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో, పౌరుషం వచ్చి బెయిల్ పిటీషన్ రద్దు చేసుకుని బుధవారం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు చింతమనేని భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఎస్పీ ఎదుట లొంగిపోవటానికి వెళ్లే ముందు, ఆవిడను చూడటానికి దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు చేరుకున్నారు.
ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయమే చింతమనేని ఇంటికి చేరుకున్న పోలీసులు…ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింతమనేని ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.