భార్యభర్తల మధ్యే ఆధిపత్య పోరాటం.. టెక్కలి వైసీపీలో గ్రూప్‌ వార్‌

భార్యభర్తల మధ్యే ఆధిపత్య పోరాటం.. టెక్కలి వైసీపీలో గ్రూప్‌ వార్‌

Tekkali Assembly constituency

Tekkali Assembly Constituency : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో అదొకటి. అక్కడ గెలుపు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎంతో ముఖ్యం. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో గెలిస్తే.. వైసీపీకి వంద ఏనుగుల బలం వచ్చినట్లే.. మరి అంత ముఖ్యమైన చోట వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. అధినేతకు వ్యక్తిగత ప్రతిష్ట చేసుకున్న నియోజకవర్గంలో ఫ్యాన్‌ పార్టీ గెలిచే సీన్‌ ఉందా?

ఒక్కసారి కూడా టెక్కలిలో సక్సెస్‌ సాధించలేకపోయిన వైసీపీ..
టెక్కలి.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడ ఇంతవరకు అచ్చెన్నకు గాని.. టీడీపీకి గానీ ఎదురే లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన టెక్కలిలో పసుపు జెండాకు తిరుగేలేదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనూ.. శ్రీకాకుళం జిల్లాలోనూ ఫ్యాన్‌ గిరిగిరా తిరిగినా.. టెక్కలిలో మాత్రం సైకిల్‌ జోరును ఆపలేకపోయింది. అంతేనా.. అక్కడి నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అధికార పక్షానికి కొరకురాని కొయ్యిగా మారారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నకు ఓటమి రుచి చూపించాలని అధికార వైసీపీ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తోంది. కానీ ఇంతవరకు ఒక్కసారి సక్సెస్‌ సాధించలేకపోయింది.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

సీఎం జగన్‌ స్కెచ్‌ వేస్తే.. అది జరిగి తీరాల్సింది.. కానీ, టెక్కలిలో వైసీపీ పాచికలు పారకపోవడానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గ నేతల్లో కుమ్ములాటలే అన్న విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ అగ్రనాయకత్వం కూడా స్థానిక నేతల పంచాయితీని తీర్చలేకపోయిందని అంటున్నారు. ముఖ్యంగా నలుగురు నేతల మధ్య నాలుగు స్తంభాల ఆటలా తయారైంది టెక్కలి వైసీపీ పరిస్థితి.

అతిపెద్ద సమస్యగా మారిన ఇంటిపోరు..
ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కు ఇతర నేతలతో అసలు పొసగడం లేదు. సరికదా.. ఆయనకు ఇంటిపోరు కూడా అతిపెద్ద సమస్యగా మారింది. గత ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా తలపడిన దువ్వాడకు ఎమ్మెల్సీ చేసి.. టెక్కలి బాధ్యతలు అప్పగించింది వైసీపీ.. అయితే ఆయన పనితీరు.. వ్యక్తిగత ప్రవర్తనపై కుటుంబం నుంచే అభ్యంతరాలు ఉండటంతో మధ్యలో కొన్ని నెలలు తప్పించి.. మళ్లీ దువ్వాడకే బాధ్యతలు అప్పగించింది వైసీపీ.

ముందుగా దువ్వాడ సతీమణి వాణికి టెక్కలి సీటు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌.. ఏమైందో కాని సడన్‌గా ఆమెను తప్పించి మళ్లీ ఎమ్మెల్సీనే టెక్కలి ఇన్‌చార్జిగా నియమించారు. అధిష్టానం మద్దతుతో ఇన్‌చార్జి పదవి తెచ్చుకున్నా.. సొంత ఇంటిలో నెగ్గలేని దువ్వాడ.. ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు పార్టీలోని ఆయన ప్రత్యర్థులు.

టెక్కలి వైసీపీలో నాలుగు గ్రూపులు..
టెక్కలి వైసీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ది ఓ గ్రూప్‌ అయితే.. ఆయన భార్య వాణిది మరోగ్రూప్‌.. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి.. కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేడాడ తిలక్‌ ఆధ్వర్యంలో మరో రెండు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీచేసిన తిలక్‌ను ఈసారి శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు సీఎం జగన్.. అయితే టెక్కలి ఇన్‌చార్జి దువ్వాడతో మిగిలిన ఏ ఒక్కరికీ సఖ్యత లేకపోవడం.. ఆయన ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులతో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు వస్తాయోననే టెన్షన్‌ వైసీపీ క్యాడర్‌లో కనిపిస్తోంది.

Also Read : వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

భార్యభర్తల్లో ఎవరిది పైచేయి అవుతుందో?
శ్రీనివాస్‌ వద్దు.. వాణి ముద్దు అంటూ టెక్కలి కార్యకర్తలు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది. భార్యభర్తల మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం జరుగుతుండటం మరింత ఆసక్తిరేపుతోంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. మొత్తానికి భార్యభర్తల్లో ఎవరిది పైచేయి అవుతుందో.. భార్యను గుప్పెట పెట్టుకుని చిరకాల ప్రత్యర్థిని ఎలా ఓడిస్తారో కాలమే నిర్ణయించాలి.