ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 12:46 AM IST
ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం

Updated On : March 16, 2020 / 12:46 AM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్‌లో శాసనసభ ఫ్లోర్‌ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, హరీశ్‌రావు, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. 

శాసనసభ, మండలి రెండూ 2020, మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. చివరి రోజు సమావేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన తర్వాత తీర్మానం చేస్తారు.

ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర బిల్లులతో పాటు, సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తరువాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం మండలి కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. 

అసెంబ్లీ సమావేశ తేదీల కుదింపు నేపథ్యంలో బడ్జెట్‌ పద్దులపై ఆదివారం చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 25 పద్దులపై పలు పార్టీ లకు చెందిన 23 మంది సభ్యులు ప్రసంగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు పద్దులపై మొదలైన చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రుల సమాధానాలు చెప్పారు.
Read More : కార్ఖానాలో విషాదం : పాతభవనం కూల్చివేత..కూలి మృతి