రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ లాంటి పాలకుల గుర్తులు ఉందొద్దని నిర్ణయం- సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ లాగా ఉంటుందని ఆశించాం. తెలంగాణ తల్లి మన అమ్మలాగా ఉండాలని అనుకున్నాం.

CM Revanth Reddy Powerful Speech
CM Revanth Reddy : తెలంగాణ మన అందరికీ ఒక ఎమోషన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత తెలంగాణ నేపథ్యాన్ని మాట్లాడుకోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. సాధించిన తెలంగాణలో ఇంకా కలలు నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగం రోజూ, దానిపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా కేసీఆర్ సభకు రాలేదన్నారు. కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి సభకు వచ్చి మాకు సలహాలు, సూచనలు ఇస్తారని అశించామన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు, TS ను TG గా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
”ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం సభను అవమానపరచడమే. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ని ఒప్పించడానికో, మెప్పించడానికో బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. నాడు ఉద్యమ సమయంలో AP ని చెరిపేసి TG అని రాసుకున్నాం. బండ్లపై మాత్రమే కాదు గుండెలపై కూడా TG అని రాసుకున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు TG అని ఉండాలని కేంద్రం చెబితే తన పార్టీకి నకలుగా ఉంటుందని TS అని పెట్టారు.
రాష్ట్ర అధికార చిహ్నంలో ఫ్యూడల్ గుర్తులు ఉందొద్దని మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ లాంటి పాలకుల గుర్తులు ఉందొద్దని నిర్ణయం తీసుకున్నాం. కిరీటాలు, వడ్డానాలు పెట్టుకున్న వాళ్ళని గడీల్లో మాత్రమే చూశాం. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ లాగా ఉంటుందని ఆశించాం. తెలంగాణ తల్లి మన అమ్మలాగా ఉండాలని అనుకున్నాం. జయజయహే తెలంగాణ గీతం తెలంగాణలో ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపింది. గొప్పతనం అంతా ఒక దళిత బిడ్డకి దక్కకూడదని అందెశ్రీ రాసిన గీతాన్ని పక్కన పెట్టారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.