నేను వస్తున్నా, కాస్కోండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

పులి బయటికి వస్తుందని అన్నారు కదా. రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీగా ఉన్నాము. ఏ హామీని అమలు చేయని బీఆర్ఎస్ నాయకులకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు.

నేను వస్తున్నా, కాస్కోండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

CM Revanth Reddy Strong Warning For BRS

CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ దయ వల్లే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు హామీల అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారాయన. ఫిబ్రవరి చివరి వరకు రైతుభరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేసే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గుంపు మేస్త్రీ అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

”అవును.. నేను మేస్త్రీనే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్ నిర్మాణం చేస్తున్న మేస్త్రీ నేనే. ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను. కాస్కోండి. కేసీఆర్ ఎవరిని రాజ్యసభ సభ్యులను చేశారు? దోచుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చారు. 50వేల రూపాయలు లేకున్నా 52వేల మెజార్టీ సాధించిన సామేలుకు మేం టికెట్ ఇచ్చాం” అని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం

”దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నికై 6నెలలు కాకముందే మంత్రి, కేంద్రమంత్రి కావాలని అడిగే ఈరోజుల్లో రాహుల్ గాంధీ ఏనాడూ నన్ను ప్రధాని చేయండని అని ఎప్పుడైనా అడిగారా? స్వతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటిదో ప్రస్తుత బీజేపీ నాయకులు చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీని మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలి.

మనకు మోదీతో యుద్ధం. గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదు. జనాలు బీఆర్ఎస్ ను ఊరికే ఓడగొట్టలేదు. జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ ను ఓడించారు. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజులలోపు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తాము. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశాము. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాము. బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేయని బీఆర్ఎస్ నాయకులకు మమ్మల్ని అడిగే హక్కు లేదు.

ఫిబ్రవరి నెలాఖరువరకు రైతుబంధు పూర్తిగా వేస్తాము. రేవంత్ రెడ్డి నిజంగా మేస్త్రీనే. మీరు చేసిన విధ్వంసాన్ని సరి చేసే మేస్త్రీని నేను. మిమ్మల్ని 100 మీటర్ల లోతులో ఘోరీ కట్టే మేస్త్రీని నేనే. ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లికి వస్తున్న కాస్కోండి. కేసీఆర్ ఎవరిని రాజ్యసభ సభ్యులు చేశారు? కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న పార్థసారథిరెడ్డిని, రవిచంద్ర, దామోదరలను రాజ్యసభ సభ్యులను చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్లు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు. మరి మీరు ఎవరికి టికెట్లు ఇచ్చారు? కాంగ్రెస్ ఒక దళితుడిని ఏఐసీసీ చీఫ్ చేసింది. మరి మీరు ఎవరిని చేశారు? 17 పార్లమెంట్ స్థానాల్లో నేను సభలు పెడతాను. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఓడించాము.

Also Read : రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. అభ్యర్థుల విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?

ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాము. బిల్లా, రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ శోభరాజు ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నారు. పులి బయటికి వస్తుంది అన్నారు కదా రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీగా ఉన్నాము. మోదీ కేడీ రెండూ ఒక్కటే. నాణేనికి మోదీ ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కేసీఆర్ మోదీకి తాకట్టు పెడతారు. ఇందిరమ్మ కమిటీలు వేస్తాము. అందులో బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఉంటారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.