Congress First List : కాంగ్రెస్ లోక్‌సభ తొలి జాబితా రెడీ..! అభ్యర్థులు వీళ్లే?
రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Telangana Congress MP Candidates First List
Congress First List : లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అందుకే, తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఈసీలో రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ కోరనున్నారు. మహబూబ్ నగర్ సీటును చల్లా వంశీచంద్ రెడ్డికి ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. మల్కాజ్ గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని పోటీకి దించే అవకాశం ఉంది.
ఇక చేవెళ్ల సీటును ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. నల్లొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కు అవకాశం కల్పించే యోచనలో కాంగ్రెస్ ఉంది. కరీంనగర్ ఎంపీ స్థానానికి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ పేర్లు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి మస్కటీతో పాటు మరో ఇద్దరు మహిళా నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
వరంగల్ స్థానానికి దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ సీటు తనకే ఇస్తారన్న ధీమాలో మల్లురవి ఉన్నారు. అయితే, అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు వంశీతో పాటు మాజీ ఎంపీ సుగుణకుమారి, స్థానిక నేత శ్యామ్ పేర్లు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుంచి పరిశీలనలో బలరాం నాయక్, విజయాబాయి పేర్లు పరిశీలిస్తున్నారు.
Also Read : మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత