పత్తికొండ వైసీపీలో టికెట్ వార్.. రేసులో ఆ ముగ్గురు నేతలు
వైసీపీకి గట్టి హోల్డ్ ఉన్న జిల్లా కావడంతో ఆశావహులు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్పీడ్‌తో పాటు సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలా నెట్టుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది

Pattikonda YCP Ticket War
Pattikonda YCP : వైసీపీలో మార్పులుచేర్పుల ఎఫెక్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతా సవ్యంగా ఉందనుకున్న వారికి సైతం టికెట్‌పై గ్యారెంటీ లేదన్న ప్రచారం.. కొత్త తలనొప్పులు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేను మార్చేస్తారన్న టాక్‌తో కొత్త నేతలు.. వింత వాదనలతో రేసులోకి వస్తుండటంతో సిట్టింగ్‌ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది.
కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీలో టికెట్ వార్ తారస్థాయికి చేరింది. ఒకప్పుడు టీడీపీకి గట్టిబలం ఉన్న ఈ నియోజవకర్గంలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రికార్డు విజయం సాధించారు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఎమ్మెల్యేకి మార్పులు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ఐదేళ్లుగా నియోజకవర్గంలో అన్నీతానై చూసుకున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు స్థానిక నేతల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలను మార్చుతున్న వైసీపీ.. ఇప్పటివరకు పత్తికొండను టచ్ చేయలేదు. అయితే పార్టీ చేసిన సర్వేల్లో ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రతికూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మరో ఇద్దరు కొత్త నేతలు టికెట్ రేసులోకి దూసుకువచ్చారు. ఇందులో సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడైన పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి స్థానిక నినాదంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ కూడా పోటీకి రెడీ అవుతుండటంతో పత్తికొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!
సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డికి నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉండటంతో తన గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు నాగరత్నమ్మ. ఇక మురళీధర్‌రెడ్డి కూడా టికెట్ రేసులో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
టికెట్ కోసం ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు మిగిలిన ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఎవరికి చాన్స్ వస్తుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీకి గట్టి హోల్డ్ ఉన్న జిల్లా కావడంతో ఆశావహులు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్పీడ్‌తోపాటు సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలా నెట్టుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ స్థానికేతులకే అవకాశం ఇస్తున్నందున.. ఈసారి లోకల్ లీడర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తున్న మురళీధర్‌రెడ్డికి అవకాశం దక్కుతుందా, లేక అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న ఎస్వీ కుటుంబానికి చాన్స్ వస్తుందా? అన్న ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది.
Also Read : టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం