ఎమ్మెల్సీ చాన్స్ కోసం టీఆర్ఎస్ నేతల ఫైటింగ్

అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గతంలో ప్రభుత్వం నియమించిన రాములు నాయక్, నాయిని నరసింహారెడ్డి, కర్నె ప్రభాకర్ పదవీకాలం పూర్తయింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాములు నాయక్ టీఆర్ఎస్‌ను వీడడంతో అనర్హత వేటు పడింది. నాయిని నరసింహారెడ్డి పదవీ కాలం గత నెలలో పూర్తి కాగా…. కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఈ మూడు స్థానాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ముగ్గురు అభ్యర్థులతో స్థానాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు :
వచ్చే నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే ముగ్గురు శాసనమండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆనవాయితీగా జరిగే మంత్రిమండలి సమావేశంలో ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
గవర్నర్ కోటాలో మూడు స్థానాలతో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు రెండు, మూడు రోజుల్లో ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ కానుంది. రాబోయే శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో టీఆర్ఎస్ తరఫున కొత్త సభ్యులు పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
కవిత గెలుపు లాంఛనమే :
నిజామాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే అని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ గవర్నర్ కోటాలో ఎంపిక చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవలే పదవీ కాలం పూర్తయిన కర్నె ప్రభాకర్‌కు మరోసారి మండలికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. నాయిని నర్సింహా రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నా…. ఆ స్థానం ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి రేపుతోంది. మూడో స్థానంలో కొత్త వారికే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
పీవీ కూతురు పేరు తెరపైకి :
పివీ కూతురు వాణి పేరు తెరపైకి వచ్చినా జాతీయ స్థాయిలోనే ఆమె గుర్తింపును వాడుకోవాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా శాసనమండలి అభ్యర్థిత్వం ఆమెకు ఖరారయ్యే అవకాశాలు దాదాపు లేనట్లే అని అంటున్నారు. దేవీప్రసాద్, దేశపతి శ్రీనివాస్, ఎస్టీ కోటాలో సీతారాం నాయక్, ఎస్సీ కోటాలో బాల మల్లు పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు.
ఒకవేళ నాయినిని కొనసాగించకపోతే ఆ స్థానం తనకే కేటాయిస్తారనే ధీమాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉండే శ్రవణ్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను సీఎం కేసీఆర్ భర్తీ చేస్తారన్న ప్రచారంతో అవకాశం ఎవరికి దక్కుతుందా అన్న చర్చలు గులాబీ నేతల్లో జోరుగా మొదలయ్యాయి.